శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (14:26 IST)

ఏపీలో ఎన్నికలైతే.. కేసీఆర్‌ను ఎందుకు ఓడించాలని పిలుపునిస్తున్నారు : వైఎస్ విజయమ్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ను ఓడించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే పిలుపునివ్వడంపై వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయమ్మ ప్రశ్నించారు. ఆంధ్రాలో ఎన్నికలైతే కేసీఆర్‌ను ఓడించాలని చంద్రబాబు నాయుడు ఎందుకు రెచ్చగొడుతున్నారంటూ ఆమె నిలదీశారు. స్వలాభం కోసం చంద్రబాబు ఇంతలా దిగజారిపోవాలా? అని అన్నారు. టీఆర్ఎస్‌తో వైసీపీ పొత్తు ఉందని చంద్రబాబు అంటున్నారని... జగన్ ఎవరితో పొత్తు పెట్టుకోడని ఆమె స్పష్టం చేశారు.
 
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆమె బుధవారం విజయనగరం జిల్లా గజపతినగరం రోడ్ షోలో మాట్లాడుతూ, తాను అనుకున్నది సాధించడానికి చంద్రబాబు ఏమైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. బెదిరిస్తాడు. మాట వినకుంటే ఏదైనా చేస్తాడు. అలాంటిది 'మీ భవిష్యత్‌ నా బాధ్యత' అని చెబుతున్న చంద్రబాబు మిమ్మల్ని ఏవిధంగా కాపాడతాడు. 17 కేసుల్లో స్టే తెచ్చుకుని మేనేజ్‌ చేస్తున్న ఆయన... జగన్‌ బాబుపై 31 కేసులు ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు.
 
'నేను అడుగుతున్నా ఆ కేసులు పెట్టింది ఎవరు? మీరు కాదా?. జగన్‌ బాబు తనపై పెట్టిన అక్రమ కేసులపై పోరాడుతున్నాడు. మీరే చెప్పండి ఎవరికి నిజాయితీ ఉంది. తమ్ముళ్లు నన్ను రక్షించండి.. నా చుట్టు ఉండండి... ‘మీ భవిష్యత్‌ నా బాధ్యత’ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు భయం పట్టుకుంది. అందుకే తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా... ప్రతిపక్షంతో పాటు ఎదుటి వ్యక్తులపై బురద చల్లుతున్నాడు అంటూ మండిపడ్డారు. 
 
ఇకపోతే, విజయనగరం జిల్లా అంటే రాజశేఖరరెడ్డికి ఎంతో ప్రేమని... ఎందుకంటే రాయలసీమలా ఈ ప్రాంతం కూడా వెనుకబడిన ప్రాంతమన్నారు. టీడీపీ పాలనలో ఈ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. తోటపల్లి నీరు రైతులకు అందడం లేదని చెప్పారు. గతపతినగరంకు నూరు పడకల ఆసుపత్రి రాలేదని... గోస్తని, చంపావతి నదుల అనుసంధానం జరగలేదని విమర్శించారు. అనుభవం ఉందని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఆరు వందల హామీలు ఇచ్చారని... ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమం తప్ప చంద్రబాబుకు మరేమీ పట్టదని వైఎస్. విజయమ్మ దుయ్యబట్టారు.