శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2024 (10:05 IST)

జగన్ ముఖ్యమంత్రి కాదు.. ఓ సారా వ్యాపారి : పవన్ కళ్యాణ్ ధ్వజం

pawan kalyan
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కాదని, సారా వ్యాపారి అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికల ప్రచారంలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని ప్రజలను నమ్మించి, మోసగించి ఓట్లు వేయించుకున్న ఆ తర్వాత ఏకంగా ఆ మద్యంవ్యాపారాన్ని తానే చేస్తున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అందుకే ఈ జగన్ ముఖ్యమంత్రి కాదనీ, ఓ సారా వ్యాపారంటూ ధ్వజమెత్తారు. 
 
ఆదివారం అనకాపల్లిలో జరిగిన వారాహి విజయభేరీ సభకు పవన్ కళ్యాణ్ హాజరై ప్రసంగిస్తూ, అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకువచ్చేదని, కానీ ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకువస్తోందంటూ మాజీ మంత్రి, వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్నాథ్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవాళ జనసేన పార్టీ నిజంగా త్యాగం చేసిందని, ప్రజలందరి అభిమానం తమకే లభించాలని ప్రతి పార్టీకి ఓ స్వార్థం ఉంటుందని, అయితే జనసేన ఆ పరిస్థితిని అధిగమించి రాష్ట్రం బాగుండాలని సీట్ల సర్దుబాటుకు ముందుకు వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
 
ఒక్క తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో మూడు పార్టీలు కలిశాయన్నారు. రాజకీయ పార్టీని నడపడం అంటే సులభమేమీ కాదన్నారు. తన ఒక్కడి ప్రయోజనాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల భవిష్యత్తు బాగుండాలనే తాను పార్టీ పెట్టానని వివరించారు. మంత్రి పదవి మాత్రమే కోరుకుంటే, తనకు ఆ పదవి ఎప్పుడో లభించి ఉండేదని, కానీ తనకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం అని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. అనకాపల్లి స్థానం జనసేనదే అయినప్పటికీ, బీజేపీ అధిష్టానం అభ్యర్థన మేరకు సీఎం రమేశ్ అభ్యర్థిత్వాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తున్నామని తెలిపారు.
 
'అమ్మ ఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని మాటిచ్చారు. రెండో సంవత్సరం వచ్చేసరికి రూ.1000 తగ్గించి రూ.14 వేలు చేశారు. మరో సంవత్సరం తిరిగే సరికి ఇంకో రూ.1000 తగ్గించి రూ.13 వేలు చేశారు. 2021-22లో మొత్తానికి అమ్మఒడి ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఎంతమంది బిడ్డలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తామని చెప్పి, ప్రభుత్వంలోకి వచ్చాక ఒక్క బిడ్డకే అమ్మ ఒడి ఇస్తామని అన్నారు. 89 లక్షల మంది లబ్దిదారులు ఉంటే కేవలం 44 లక్షల మందికే అమ్మబడి ఇచ్చారు. అందుకోసం రకరకాల కారణాలు చెప్పారు. అమ్మఒడికి ఇచ్చిన నగదు రూ.19,600 కోట్లు అయితే, మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి నాన్న గొంతును సారాతో తడిపి సంపాదించింది రూ.లక్ష కోట్లు... ముఖ్యమంత్రి కాదతను... ఓ సారా వ్యాపారి, ఇక ఇసుక వ్యాపారి, భూములను కొల్లగొట్టే ఒక మోసగాడు అంటూ విరుచుకుపడ్డారు.