బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2024 (19:19 IST)

రావణాసురుడిని అంతం చేసేందుకే వానర సైన్యం ఏకమైంది : చంద్రబాబు

chandrababu
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా రాక్షస పాలన సాగిస్తున్న రావణాసురుడిని అంతం చేసేందుకే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిశాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నరాు. ప్రజాగళం పేరుతో సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా, పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రావణాసుర సంహారం చేసేందుకే వానర సైన్యమంతా ఏకమైందన్నారు. 
 
అంతేకాకుండా, రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం ఎంతో ముఖ్యమన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు. తెదేపా, జనసేన, భాజపా కలిసింది రాష్ట్రం కోసమేనని, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదన్నారు. 
 
'రాముడు దేవుడైనప్పటికీ.. వానరులతో కలిసి పోరాడారు. రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే భాజపాతో కలిశాం. ఈ దోపిడీ దొంగలు కృష్ణా నది మీదనే రోడ్డు వేశారు. ఇసుకాసురుడిని అంతం చేసి పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తాం. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగాయి. ముస్లింలపై అనేక దాడులు జరిగాయి. ముస్లిం మహిళలు, బాలికలను వైకాపా నేతలు వేధించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అలాగే ఉంటాయని హామీ ఇస్తున్నా. 2014లోనూ భాజపాతో తెదేపా కలిసే ఉంది. 2014-2019 మధ్య ముస్లింలకు ఏమైనా అన్యాయం జరిగిందా? రాష్ట్రంలో ముస్లింల రక్షణకు నేను హామీ ఇస్తున్నట్టు ప్రకటించారు. 
 
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు జాబు కావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలి. గంజాయి కావాలంటే జగన్‌ ఉండాలి. ఏపీ నుంచి ఎంతోమంది అమెరికాకు వెళ్లారు. తెలుగువాళ్లు అమెరికా వెళ్లేలా ఫౌండేషన్‌ వేసింది ఎవరు? పోలవరం ప్రాజెక్టును నేనే 72 శాతం పూర్తి చేశాను. ఈ ఐదేళ్లలో పోలవరం మిగతా పనులు ఏమాత్రం చేయలేదు. యువత కంటే నా ఆలోచనలు 20 ఏళ్లు ముందుంటాయి. ఆనాడు నేను చేసిన కృషితో ఇవాళ హైదరాబాద్‌ నంబర్‌ వన్‌గా ఉంది. టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా. టీడీపీ గెలిస్తే.. పెదకూరపాడులో ఐటీపార్కు ఏర్పాటుచేస్తామని ఆయన ప్రకటించారు. 

'సంపద సృష్టించి అందరికీ పంచే పార్టీ తెదేపా. కొరియా నుంచి ఏపీకి కియా సంస్థ తీసుకొచ్చా. అమరరాజా కంపెనీని వేధిస్తే అది తెలంగాణకు వెళ్లిపోయింది. తెదేపా అమలుచేసే సూపర్‌ సిక్స్‌తో మీ జీవితాలు మారతాయి. తల్లికి వందనం కింద మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. అందరికీ ఈ పథకం వర్తింపజేస్తాం. పేదలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తాం. ప్రతీ ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు సరఫరా చేస్తాం. జగన్‌ రూ.10 ఇచ్చి రూ.100 తీసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీలో జగన్‌ శవరాజకీయాలు చేస్తున్నారు. ఇంతమంది సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఇవ్వలేరా?ఎన్డీయే గెలిస్తే.. రూ.4వేల పింఛన్‌ ఇస్తాం' అని చంద్రబాబు అన్నారు.