1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 మే 2020 (20:48 IST)

లాక్‌డౌన్ కాలంలో 165 బాల్య వివాహాలు నిరోధం: కృతికా శుక్లా

కరోనా విపత్కర పరిస్ధితులలో సైతం రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ అద్వితీయమైన పనితీరుతో విమర్శల ప్రశంసలు అందుకుంటోంది. బాల్యవివాహాలను అడ్డుకునే క్రమంలో గణనీయమైన విజయాలను నమోదు చేసింది.

అయా జిల్లాల ఐసిడిఎస్ పరిధిలో పనిచేసే అంగన్ వాడీ  కార్యకర్తల ఆసరాతో, జిల్లా స్దాయి పిల్లల సంరక్షణ విభాగం సైతం తమ వంతు పాత్రను పోషిస్తున్న తరుణంలో బాల్యవివాహాల నిరోధంలో రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఎంచదగిన పాత్రను పోషించింది.

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు చేరిన సమాచారంతో పాటు,  పిల్లల సంరక్షణ టోల్ ఫ్రీ నెంబర్ 1098,  ఉమెన్ హెల్ప్‌లైన్ నెంబర్ 181కు వచ్చిన పిర్యాధుల అధారంగా బాల్య వివాహ నివారణ అధికారులు, డిసిపియు సిబ్బంది, అంగన్ వాడీ కార్యకర్తలు, స్దానిక పోలీసులతో ఏర్పడిన ప్రత్యేక బృందాలు కేవలం లాక్ డౌన్ కాలంలో మార్చి 25 నుండి మే 11 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 165 బాల్య వివాహాలను నిరోధించగలిగాయి.

కేవలం బాల్యవివాహాలను అడ్డుకోవటమే కాక, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా సైతం తాము స్పష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నామని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకులు, దిశ ప్రత్యేక అధికారి డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బాల్యవివాహాల నివారణ తదుపరి చర్యలలో భాగంగా అంగన్ వాడీ కార్యకర్తలు అయా గ్రామాలు, పట్టణాలలోని గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి సహాయంతో బాల్యవివాహాలు ప్రోత్సహిస్తున్న కుటుంబాల పట్ల ప్రత్యేక నిఘాను ఉంచుతున్నామన్నారు.

ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, సిడిపిఓలు మండల, బ్లాక్ స్థాయిలో బాల్య వివాహ నివారణ అధికారులుగా వ్యవహరిస్తున్న తరుణంలో ఆచిన్నారుల తల్లిదండ్రులకు అవసరమైన ప్రత్యేక కౌన్సెలింగ్ సైతం ఇప్పిస్తున్నామన్నారు.
                                 
బాల్య వివాహం నిలిచిపోయిన తరువాత  కొందరు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి ఇష్టపడని పరిస్దితులు కూడా ఎదురవుతున్నాయని, వీరిని శిశు సంక్షేమ కమిటీల ద్వారా సిడబ్ల్యుసిల ఆదేశాల మేరకు కస్తూరిబా బాలికా విద్యాలయాలలతో చేర్చటం ద్వారా వారి విద్యాభ్యాసానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తున్నామని డాక్టర్ కృతికా శుక్లా వివరించారు. 

కొన్ని ప్రత్యేక పరిస్ధితులలో మహిళలు, పిల్లల పునరావాసం కోసం రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న స్వధార్ గృహాలలో సైతం వీరికి ఆశ్రయం కల్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా తోడ్పాటును అందిస్తున్నామన్నారు.  రాష్ట్రంలో 13 జిల్లాల్లో కేవలం కరోనా లాక్ డౌన్ కాలంలో నిరోధించిన బాల్యవివాహాల సంఖ్యను పరిశీలిస్తే, రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ దృష్టికి వచ్చిన ప్రతి బాల్యవివాహా కార్యక్రమాన్ని అడ్డుకోగలిగారు.

అత్యధికంగా అనంతపురం 46, అత్యల్పంగా వైఎస్ ఆర్ కడపలో మూడు బాల్యవివాహాలు నియంత్రించారు. శ్రీకాకుళంలో 34, కృష్ణాలో 13, తూర్పు గోదావరిలో 12, నెల్లూరులో 11, విశాఖపట్నంలో 9, పశ్చిమ గోదావరిలో 8, కర్నూలులో 8, చిత్తూరులో 7, ప్రకాశంలో 5, విజయనగరంలో 5, గుంటూరులో నలుగురు చిన్నారులను బాల్యవివాహం బంధనాల నుండి కాపాడారు.
 
బాల్య వివాహాల నిరోధం కోసం 1098 బాలల సంరక్షణ,  181 మహిళా సహాయత నెంబర్లే కాక,  13 జిల్లాల డిసిపిఓల నెంబర్లు సైతం అందుబాటులోకి తీసుకువచ్చామని ఈ సందర్భంగా డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

జిల్లాల వారిగా కేటాయించిన నెంబర్లు ఇలా ఉన్నాయి...

శ్రీకాకుళం - 9440035576,
విజయనగరం -9494775411,
విశాఖపట్నం - 9440332581,
తూర్పు గోదావరి -  8555060818,
పశ్చిమ గోదావరి - 9491063810,
కృష్ణ - 9441400525,
గుంటూరు - 8332980968,
ప్రకాశం - 9493304884,
నెల్లూరు - 9000789793, 
చిత్తూరు - 7093372107, 
కడప - 7842297638,
కర్నూలు - 8333840129,
అనంతపురం – 9491355890
నెంబర్లలో బాల్యవివాహాల సమాచారం ఇవ్వవచ్చని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ బృందాలు వెంటనే కార్యరంగంలోకి దిగుతాయని డాక్టర్ కృతికా శుక్లా వివరించారు.

బాల్యవివాహాల నివారణకు సంబంధించి అంగన్ వాడీ కార్యకర్తలతో పాటు నూతనంగా వార్డు, గ్రామ స్దాయిలో నియమతులైన గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శి సైతం బాధ్యత వహించవలసి ఉంటుందని, తమ పరిధిలో బాల్యవివాహాలు లేవని నిర్ధారించే బాధ్యత వారిదేనని సంచాలకులు పేర్కొన్నారు.