సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (11:12 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి మందికి కరోనా... వచ్చిందట.. పోయిందట...!!

ప్రపంచాన్ని వణికిస్తున్న సూక్ష్మక్రిమి కరోనా వైరస్. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ అగ్రరాజ్యాలే గజగజ వణికిపోయాయి. ఏకంగా దేశాల సరిహద్దులనే మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ రాకలపై ఇంకా నిషేధం కొనసాగుతోంది. అలాంటి కరోనా వైరస్ ఇపుడు భారత్‌లో కల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజూ 90వేల మందికి ఈ వైరస్ సోకుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశంలో మొత్తం 45 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, ఏపీలో ఐదు లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ నియంత్రణ కోసం ఎన్నో రకాలైన చర్యలు చేపట్టినా ప్రయోజనం కనిపిచండం లేదు. 
 
ఈ క్రమంలో ఏపీలో కోటి మందికి ఈ వైరస్ సోకి పోయిందట. ఏపీ రాష్ట్ర మొత్తం జనాభా సుమారుగా ఐదు కోట్లుగా ఉంటే.. అందులో కోటి మంది అంటే 19.7 శాతం మందికి ఈ వైరస్ సోకినట్టు సీరో సర్వే తేల్చింది. రక్తంలోని సీరంలో ఉన్న యాంటీ బాడీస్‌ ఆధారంగా కరోనా వైరస్‌ సోకిందా లేదా అనే విషయాన్ని గుర్తించవచ్చు. 
 
వైరస్‌ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సీరో సర్వే నిర్వహించింది. తొలిదశలో అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించగా... 15.7 శాతం మందికి వైరస్‌ సోకి, వెళ్లిపోయినట్లు తేలింది. ఇప్పుడు... రెండో దశలో  మిగిలిన తొమ్మిది జిల్లాల్లోనూ సర్వే చేశారు. ఆ ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ గురువారం మీడియాకు వెల్లడించారు.
 
సీర్వో సర్వేలో భాగంగా ఒక్కొక్క జిల్లా నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 45 వేల శాంపిల్స్‌ సేకరించారు. వారిలో 19.7 శాతం మందికి తెలియకుండానే వైరస్‌ సోకి.. దానంతట అదే తగ్గిపోయినట్టు తేలింది. వైరస్‌ సోకిన వారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 30.6 శాతం మంది రక్త నమూనాల్లో కరోనా సంబంధిత యాంటీ బాడీస్‌ను గుర్తించారు. 
 
ఆ తర్వాత స్థానాల్లో కర్నూలు జిల్లా 28.1 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 21.5 శాతం ఉన్నాయి. ఇక... చిత్తూరు జిల్లాలో 20.8 శాతం, విశాఖపట్నంలో 20.7 శాతం, కడపలో 19.3 శాతం, గుంటూరు జిల్లాలో 18.2 శాతం, ప్రకాశం జిల్లాలో 17.6 శాతం మందిలో యాంటీబాడీస్‌ కనిపించాయి. 12.3 శాతంతో  పశ్చిమ గోదావరి ఆఖరి స్థానంలో ఉంది.