సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (15:45 IST)

ఎమ్మెల్యే రోజమ్మ శ్రమ వృథా?... నగరిలో భారీగా కరోనా కేసులు

నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, సిట్టింగ్ ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగారు. నగరి పట్టణంలోని వీధుల్లో తిరుగుతూ పారిశుద్ధ్య పనులతో పాటు.. శానిటైజేషన్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. పలు ప్రాంతాల్లో ఆమె స్వయంగా రంగంలోకి రసాయనాలను పిచికారి కూడా చేశారు. అయినప్పటికీ నగరిలో కొత్త కేసుల నమోదు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. 
 
తాజాగా నగరిలోని ఒకే కుటుంబంలో 22 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. 84 ఏళ్ల వయసున్న ఒక ప్రముఖ వ్యక్తి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి అనారోగ్యంతో గురువారం వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి చనిపోయారు. ఆయనది ఉమ్మడి కుటుంబం. నలుగురు కుమారులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లతో పట్టణంలోనే పెద్ద కుటుంబంగా పేరుంది.
 
వారం క్రితం ఆయన భార్య చనిపోయారు. దీంతో, అంత్యక్రియలకు తమిళనాడు నుంచి బంధువులు వచ్చారు. ఆ తర్వాత మూడు రోజుల క్రితం ఆయన కుమారుడు కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరారు.
 
ప్రస్తుతం వారి కుటుంబంలో 16 మందికి, పక్కింట్లో ఉన్న ఆయన తమ్ముడి కుటుంబంలో 6 మందికి కరోనా నిర్దారణ అయింది. మరోవైపు, అదే వీధిలో ఉన్న ఒక వైద్యుడితో పాటు ఆయన ఇంట్లో ఉన్న ఐదుగురికి 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తంమీద ఈ కుటుంబం నగరి పట్టణాన్ని వణికిస్తోంది. 
 
కాగా, తాజాగా ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో రోజా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. అయితే, ఈ గన్‌మెన్ గత 15 రోజులుగా సెలవులో ఉన్నట్టు రోజా చెబుతున్నారు. ఏది ఏమైనా చిత్తూరు జిల్లాలోని నగరి ఇపుడు కరోనా హాట్‌స్పాట్‌గా మారుతోంది.