ఈతకొలనులో మునిగి భారత సంతతి కుటుంబ సభ్యుల మృతి
అమెరికాలో ఘోరం జరిగింది. ఇంటిలో ఉన్న ఈత కొలనులో మునిగి భారత సంతతి కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 62 యేళ్ల భరత్ పటేల్, ఆయన 33 యేళ్ళ కూతురు నిషా పటేల్, 8 యేళ్ళ మనుమరాలు ఉన్నారు. మిడిల్‌సెక్స్ కౌంటీలో ఈ ఘటన జరిగింది. చనిపోయినవారంతా ఇటీవలే ఆ ఇంట్లోకి వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో తాము పోలీసులకు సమాచారమిచ్చామని, పోలీసులు వచ్చి ముగ్గురిని స్విమ్మింగ్ పూల్ నుంచి వెలికితీసి చూసేసరికి మృతిచెంది ఉన్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘటన గురించి 911 నెంబర్‌కు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని, వారిని స్విమ్మింగ్ పూల్ నుంచి వెలికితీసి సీపీఆర్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని పోలీసులు చెప్పారు.