మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (08:29 IST)

ఏపీలో నీట మునిగిన 28 వేల హెక్టార్ల పంట

ఏపీలో భారీ వర్షాలు, వరదలకు సుమారు 28 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ప్రాధమికంగా అంచనా వేసింది. వ్యవసాయ పంటలు 21 వేల హెక్టార్లకు హార్టికల్చర్‌ పంటలు ఆరు వేల హెక్టార్లకు నష్టం వాటిల్లింది.

వర్షం కాస్త తగ్గినా ముంపు వలన పొలాల్లో నీరు తీయకపోవడంతో పక్కా ఎన్యుమరేషన్‌కు ఇబ్బంది కలుగుతోందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. కాగా రాయలసీమలో చాలా చోట్ల ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.

దాంతో వేరుశనగ నష్టం ఇప్పటికిప్పుడు కనిపించకపోయినప్పటికీ, భూమిలో పిందెలు పడే సమయంలో వానలు కురవడం వలన దిగుబడులు బాగా పడిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వ్యవసాయ పంటల్లో మొక్కజన్న, వరికి ఎక్కువ నష్టం జరిగింది. ఇప్పటి వరకు వేసిన నష్టం అంచనాల మేరకు వరి 5,444 హెక్టార్లు, వేరుశనగ 1,198, పత్తి 5,353, పెసర 2,375, కంది 513, మినుము 338, మొక్కజన్న 6,731, సజ్జ 125, కొర్ర 47, ఆముదం 25, మిరప 10 హెక్టార్లలో దెబ్బ తిన్నాయి. హార్టికల్చర్‌ పంటల్లో కూరగాయలు, పూలు, అరటి తదితరాలకు వర్షాలు నష్టం కలిగించాయి.