సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 మార్చి 2024 (21:52 IST)

రాష్ట్రవ్యాప్తంగా 46 మంది వాలంటీర్లను తొలగించాం, రూ.3.39 కోట్లు నగదు, మద్యం స్వాధీనం: ముకేష్

Mukesh kumar Meena
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని రుజువు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 46 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షంచబోమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 144వ సెక్షన్ అమలవుతుందనీ, కనుక ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకుని నిర్వహించాల్సి వుంటుందన్నారు.
 
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులతో కలిసి తిరగరాదన్నారు. ఇలా ఎవరైనా తిరుగుతున్నట్లు కనబడితే సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటివరకూ ఒక లక్షా 99 వేల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులను తొలగించామనీ, 3 రోజుల్లో రూ. 3.39 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పవన్ కల్యాణ్ గాజు గ్లాసు చూపించిన అంశంపై ఎలాంటి నిషేధం లేదనీ, రాజకీయ ప్రకటనలు ఎవరైనా చేసుకోవచ్చని ముకేష్ కుమార్ మీనా తెలిపారు.