ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (20:15 IST)

80 శాతం ఉద్యోగాలు స్థానికులకే... చంద్రబాబు నాయుడు

అమరావతి : అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం, కొరియాకు చెందిన కియా కంపెనీతో ఒప్పందం జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయం ఒకటవ బ్లాక్‌లో గురువారం

అమరావతి : అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం, కొరియాకు చెందిన కియా కంపెనీతో ఒప్పందం జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయం ఒకటవ బ్లాక్‌లో గురువారం ఉదయం కియా కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. దాదాపు రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ తయారీ కేంద్రంలో ఏటా 3 లక్షల చిన్న కార్లు తయారవుతాయని చెప్పారు. అవకాశం ఉంటే 4 లక్షల కార్ల వరకు తయారయ్యే అవకాశం ఉందన్నారు. 2018 డిసెంబర్ నాటికి ఇది పూర్తవుతుందన్నారు. 
 
2019 జూన్ నాటికి  ఉత్పత్తి ప్రారంభిస్తారని చెప్పారు. ఇక్కడ తయారయ్యే కార్లలో 90 శాతం దేశీయ మార్కెట్‌లోనే విక్రయిస్తారని, మిగిలిన పది శాతం ఎగుమతి చేస్తారని వివరించారు. ఈ కార్ల ఉత్పత్తి కేంద్రంలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా 12 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో, తక్కువ ధర కార్లను ఈ సంస్థ తయారు చేస్తుందని చెప్పారు. 1944లో ప్రారంభమైన కియా కంపెనీకి దక్షిణ కొరియా, మెక్సికో, జర్మనీ దేశాలలో ప్లాంట్లు ఉన్నాయని, 51 వేల మంది ఉద్యోగలు పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్ల కంపెనీతో ఒప్పందం కుదరడంలో అధికారుల కృషి ప్రశంసనీయమని కొనియాడారు.
 
అభివృద్ధికి, ఆటోమొబైల్ రంగానికి లింక్ ఉందని సీఎం చెప్పారు. ఎవరైనా కొంత డబ్బు సంపాదించగానే ద్విచక్రవాహనం కొంటారని, ఇంకా ఎక్కువ సంపాదిస్తే కారు కొంటారని చెప్పారు. 2020 నాటికి ఆటోమొబైల్ రంగంలో రాష్ట్రంలో రెండు లక్షల మందికి ఉపాధి లభించాలనేది తమ లక్ష్యం అన్నారు. నీటి లభ్యతపై పారిశ్రామిక రంగం అభివృద్ధి ఆధారపడి ఉంటుందని, హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు రావడంతో అక్కడ పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ :  కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. అది 1000 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇంతటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. 
 
లక్ష మందికి ఆంగ్లంలో శిక్షణ: ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలంటే ఆంగ్ల భాషలో నేర్చుకోవడం కూడా ముఖ్యమని, అందువల్ల లక్ష మంది యువతకు ఆంగ్లలో శిక్షణ ఇచ్చేందుకు బ్రిటీష్ కౌన్సిల్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం తెలిపారు. వీలునుబట్టి ఇంకా ఎక్కవమందికి శిక్షణ ఇస్తారని చెప్పారు. ప్రైవేట్ కార్పోరేట్ విద్యా సంస్థలు కూడా ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు మొదలుపెట్టవచ్చన్నారు.