మైనర్ బాలికను గర్భవతి చేసిన యువకుడు.. పెళ్ళి చేసుకోమంటే..?

జె| Last Modified గురువారం, 13 ఫిబ్రవరి 2020 (20:25 IST)
పెళ్ళి చేసుకుంటానంటూ మైనర్ బాలికను ప్రేమలోకి దించిన ఒక యువకుడు కోరిక తీరాక మొహం చాటేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. కరప మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతానికి వలస వెళ్లడంతో తాతయ్య ఇంట్లో ఉంటోంది.

బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న అదే గ్రామానికి చెందిన వేమగిరి గణపతి అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఏడాదిగా ఆమెను లైంగికంగా లోబరుచుకున్నాడు. దీంతో ఇటీవల బాలిక తరుచూ అనారోగ్యానికి గురవుతోంది. ఆమె శరీరంలో వచ్చిన మార్పులను గమనించిన పాఠశాల సిబ్బంది వైద్య పరీక్షలు చేయించగా ఐదు నెలల గర్భిణి అని తేలింది.

దీంతో కుటుంబసభ్యులు ఆమెను నిలదీయగా అసలు విషయం చెప్పింది. వారు గణపతిని పిలిపించి బాలికను పెళ్లిచేసుకోవాలని కోరగా తిరస్కరించాడు. ఆమె గర్భం రావడానికి తను కారణం కాదని వెళ్ళిపోయాడు. దీంతో మనస్థాపం చెందిన బాధితురాలు నిన్న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకుంది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :