గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 3 ఆగస్టు 2021 (12:22 IST)

ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు పోరాటం

తెలుగుదేశం హ‌యాంలో, సీఎంగా చంద్ర‌బాబునాయుడు ఉండ‌గా, అన్నీ తానై చ‌క్రం తిప్పిన సీనియర్ ఐపీయస్ అధికారి ఎబీ వెంకటేశ్వరరావు ఇపుడు న్యాయపోరాటాన్ని ఎంచుకున్నారు. జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత ఏబీని స‌స్పెండ్ చేసిన విష‌యం విదిత‌మే. దీనితో త‌న‌కు, త‌న కెరీర్‌కి అన్యాయం చేశార‌ని, ఏబీ న్యాయ‌పోరాటం చేస్తున్నారు.
 
తనపై తప్పుడు ఫిర్యాదు చేసి ఇంటెలిజెన్స్ పోస్టు నుంచి తొలగించారని ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఆరోపిస్తున్నారు. గత నెల 19న ఎంపీ విజయసాయిరెడ్డికి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు లీగల్ నోటీసులు ఇచ్చారు. విజయసాయిరెడ్డితో పాటు సాక్షి మీడియా వ్యవహారాలు చూసిన, ప్ర‌స్తుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తితో సహా ఏడుగురికి పరువునష్టం నోటీసులిచ్చారు. ఈ కారణంగానే తన డిస్మిసల్‌కు ప్రతిపాదనలు పంపారని వెంకటేశ్వరరావు భావిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదనలు పంపింది. 
 
గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో సీఎంఓ లో కీల‌కంగా మారి, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు స‌న్నిహితంగా మెలిగిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై, జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ చేపట్టారు. కీల‌క ఆధారాలు దొరికాయ‌ని,  ఆ వెంటనే ఆయనపై సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు. నిఘా పరికరాల కొనుగోలు ఆరోపణలతోపాటు, కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ అభియోగాలు నమోదు చేశారు. ఆయన సస్పెన్షన్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. 
 
శాఖాపరమైన విచారణలో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు కొద్ది రోజుల క్రితం కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవలే ఆయన కేసులకు సంబంధించి ప్రజెంటింగ్‌ ఆఫీసర్‌ను కూడా నియమించారు. ఇంతలోనే ఆయన్ను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే, ఎలక్షన్ కమిషన్ ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి  పూట తనని ఇంటలిజెన్స్ పోస్టు నుంచి తొలగించార‌ని ఇపుడు ఏబీ న్యాయ‌ప‌రంగా గురి పెడుతున్నారు. ఆత్మాభిమానం విషయంలో రాజీప‌డే  ప్రసక్తే  లేదని, తాను  బెదిరింపులకు లొంగనని చెపుతున్న‌ట్లు స‌మాచారం. తాను డిస్మిస్ అయితే,  ఒక పక్క  న్యాయస్థానాల్లో  పోరాడుతూనే, ముఖ్యమంత్రిపై, ఆయన ప్రభుత్వంపై  పూర్తి  దూకుడుతో  వెళ్లే  అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఏబీ రూపంలో మ‌రో ర‌ఘ‌రామ‌ను  జగనే త‌యారు చేసుకుంటున్నార‌ని టీడీపీ నేత‌లు చెవులు కొరుక్కుంటున్నారు.