శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:54 IST)

ఊపాధి హామీ రూ. 2,500 కోట్లు, నవరత్నాల‌కు వాడేశారు!

హైకోర్టు ధర్మాసనం ఆదేశానుసారం ఆగస్టు 1న‌ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి బిల్లులు చెల్లించాల‌ని, కానీ న‌యా పైసా చెల్లించ‌లేదని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. దీనిపై ఆగస్టు 4 న కోర్టు వాయిదా ఉంద‌ని, అందులో రాష్ట్ర ప్రభుత్వం పై కోర్టు దిక్కరణ పిటిషన్ వేస్తామ‌ని తెలిపారు. 
 
నరేగా బిల్లుల బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే చెల్లించాలని ఉయ్యూరు ఎంపీడీఓకి  రాజేంద్ర ప్రసాద్, ఇత‌ర తెదేపా నాయకులు మెమోరాండం ఇచ్చారు.  2018 - 2019 సంవత్సరంలో ఉపాధి హామీ పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, డబ్బులు ఇవ్వకపోవడం దారుణమ‌ని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఉపాధి పనులు చేసిన వారిలో 80 శాతం మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలైన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉన్నార‌ని తెలిపారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మసనానికి  ఎప్పటికప్పుడు కుంటి సాకులు చెబుతూ, ప్రతి వాయిదాకు అబద్దాలు చెబుతూ, కోర్టును తప్పు త్రోవ పట్టిస్తూ, బిల్లులు చెల్లించకుండా  కాలయాపన చేస్తోంద‌ని రాజేంద్ర ప్రసాద్ విమ‌ర్శించారు. 
 
రూ. 2,500 ల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి, తన నవరత్న పథకాలకు వాడేసుకోవడం వలనే ఈ దుస్థితి ఏర్పడింద‌ని,  దీనివలన ఉపాధి పనులు చేసిన వేలాది మంది అప్పులపాలైపోయి బిల్లులు రాక ఆత్మ హత్యలు చేసుకుంటున్నార‌ని, ఈ పాపం రాష్ట్ర ప్రభుత్వానిదే అని రాజేంద్ర ప్రసాద్ విమ‌ర్శించారు. వెంటనే  ఉపాధి నిధులు రూ 2,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోతే న్యాయ పోరాటం చేస్తూనే, రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ పోరాటాలు చేస్తామన్నారు.