శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (09:26 IST)

అయ్యో... పాపం...! అన్యాయంగా బలయ్యారు.. లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు... ఇద్దరు మృతి

వారు ఏ పాపం ఎరుగరు. తన విధి నిర్వహణగా పంక్చరయి టైర్‌ ఊడదీసే పనిలో ఉన్నారు. అయితే మృత్యువు వారిని ప్రైవేటు బస్సు రూపంలో అమాంతం మింగేసింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. విజయవాడ-మంగళగిరి మధ్య జాతీయ రహదారిపై జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
సోమవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా నరసారావుపేట నుంచి విజయవాడ వెళ్తున్న మినీ లారీ టైర్‌ పంక్చర్‌ అయింది. తాడేపల్లి వద్ద క్లీనర్‌ సాయి సుధీర్‌ అనే మరో వ్యక్తి సహాయంతో టైర్‌ మార్చుకుంటున్నారు. అదే సమయంలో ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఒకటి శర వేగంగా దూసుకు వచ్చి లారీని ఢీకొంది. టైరు మార్చుతున్న సాయి (35), సుధీర్‌(30) అక్కడికక్కడే మృతిచెందారు. 
 
వేగంగా ఢీకొనడంతో బస్సు డ్రైవర్‌ వెంకటనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులో 25 మంది ప్రయాణికులుండగా 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.