శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 7 జనవరి 2019 (19:11 IST)

అరకులో రాష్ట్ర సాహ‌స ప‌ర్య‌ట‌న హంగుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌చారం

సాహస ప‌ర్య‌ట‌న నిర్వాహ‌కుల స‌ద‌స్సుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వేదిక కాబోతుంది. ఆంధ్రా ఊటీగా ప్ర‌సిద్ది గాంచిన అర‌కు ఇందుకు సిద్దం అవుతుండ‌గా, ప‌ర్యాట‌క రంగానికి విశేష ప్రోత్సాహం ఇస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం ఇందుకు ప్ర‌త్యేక స‌హ‌కారాన్ని అందిస్తోంది. జాతీయ స్థాయిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క రంగాన్ని అగ్ర‌స్ధానంలో నిల‌పాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆకాంక్ష‌ల మేర‌కు ప‌ర్యాట‌క శాఖ చేస్తున్న క‌స‌ర‌త్తు వేగ‌వంతం అయ్యింది. 
 
సంక్రాంతి వేడుక‌ల త‌దుప‌రి జ‌న‌వ‌రి 17 నుండి 20 తేదీ వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుండ‌గా, ఇది రాష్ట్ర ప‌ర్యాట‌క రంగానికి మ‌రింత ఊపును తీసుకురానుంద‌ని ప‌ర్యాట‌క, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమ‌వారం స‌చివాల‌యంలో స‌ద‌స్సు కార్యాచ‌ర‌ణ‌కు సంబంధించి ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఎపిటిడిసి ఎండి, ఎపిటిఎ సిఇఓ హిమాన్హు శుక్లా, స‌ద‌స్సు స‌హ ఛైర్మ‌న్ శేఖ‌ర్ బాబు త‌దిత‌రులు ఈ స‌మీక్ష‌లో పాల్గొన‌గా, కార్య‌క్ర‌మానికి స్వ‌యంగా ముఖ్య‌మంత్రి హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్నందున నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి అన్ని ర‌కాల జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా మీనా అధికారుల‌ను అదేశించారు.
 
సాహ‌స ప‌ర్య‌ట‌న - భ‌విష్య‌త్తు స‌వాళ్లు, అవ‌కాశాలు అనే అంశం నేప‌ధ్యంలో స‌దస్సు నిర్వ‌హిస్తున్నామ‌ని ఈ రంగం ప్ర‌ముఖులు, ప్ర‌భుత్వ అధికారులు అయా విష‌యాల‌పై చ‌ర్చ‌లో పాల్గొంటార‌న్నారు. మూడు రోజ‌లు కార్య‌క్ర‌మాల నేప‌ధ్యంలో పారా మోట‌రింగ్‌, వాట‌ర్ రోల‌ర్‌, హాట్ ఎయిర్ బెలూనింగ్‌, క‌యాకింగ్‌, సైకిలింగ్‌, హైక్స్‌, జార్బ్ త‌దిత‌ర సాహ‌స ప‌ర్యాట‌క అంశాల ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌న్నారు. 
 
రోప్ యాక్టివిటీ, జిప్ లైన్ వంటివి స‌ద‌స్సు ప్రాంగ‌ణంలోనే జ‌ర‌గ‌నుండ‌గా, మిగిలిన అంశాలు బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో నిర్వ‌హిస్తార‌ని మీనా వివ‌రించారు. కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ నేప‌ధ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క రంగం ప‌లు రూపాల‌లో ప్ర‌యోజ‌నం పొంద‌నుంద‌న్నారు. రాష్ట్రం భౌగోళికంగా విభిన్న ప్ర‌త్యేక‌త‌లు సంత‌రించుకోగా, సాహ‌స‌ కృత్యాల‌కు అవ‌స‌ర‌మైన అన్ని హంగులు ఇక్కడ ఉన్నాయ‌ని స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ ద్వారా వీటికి జాతీయ స్దాయిలో ప్రాచుర్యం ల‌భిస్తుందన్నారు.  క‌డ‌ప జిల్లాలోని గండికోట రాష్ట్రానికి ప్ర‌ధాన సాహస ప‌ర్యాట‌క ప్రాంతం కాగా,  హార్ల్సీ హిల్స్‌, త‌ల‌కోన‌, ఓర్వ‌క‌ల్లు, మ‌హానంది, అర‌కు, మారెడుమిల్లి ప్రాంతాలు భూగోళ ప‌ర‌మైన సాహ‌స ప‌ర్యాట‌కానికి అనువైన‌వ‌న్నారు.
 
జ‌ల ఆధారిత సాహ‌స క్రీడ‌ల‌కు అమ‌రావ‌తిలోని ఎన్‌టిఆర్ సాగ‌ర్‌, తాడిప‌త్రి రిజ‌ర్వాయ‌ర్‌, గోదావ‌రి జ‌లాలు అనువుగా ఉన్నాయ‌ని మీనా వివ‌రించారు.. మ‌రోవైపు వాయి క్రీడ‌ల‌కు అనువైన ప్రాంతాల‌కు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొద‌వ‌లేద‌ని ఆక్ర‌మంలో పుట్ట‌ప‌ర్తి, నాగార్జున సాగ‌ర్‌, క‌ర్నూలుల‌లో వైమానికత‌లం అందుబాటులో ఉంద‌ని సాహస వాయి క్రీడ‌ల‌కు ఇది ఉప‌యోగక‌రం కాగా స‌ద‌స్సు ద్వారా జాతీయ స్దాయి సాహ‌స ప‌ర్య‌ట‌న నిర్వాహ‌కులకు వీటికి సంబంధించిన పూర్తి అవ‌గాహాన ఏర్ప‌డుతుంద‌న్నారు. త‌ద్వారా పర్యాట‌కుల పాద‌ముద్ర‌లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని, మ‌రోవైపు అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల రాక కార‌ణంగా విదేశీ మారక‌ ద్రవ్యం కూడా స‌మ‌కూరుతుంద‌న్నారు.