మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

విమాన చక్రం తయారు చేయలేని సంస్థతో రాఫెల్ డీల్ : అసదుద్దీన్

భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రాఫెల్ ఒప్పందం దేశీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ డీల్ ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నల్లో జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రాఫెల్ ఒప్పందం దేశీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ డీల్ ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నల్లో జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలం చేకూర్చిపెట్టాయి. దీంతో ఒప్పందంలోని నిజానిజాలు, జరిగిన అవినీతిని వెలికితీసేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ పట్టుబడుతోంది.
 
ఈ నేపథ్యంలో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, విమాన చక్రం కూడా తయారుచేయలేని సంస్థతో రాఫెల్‌ ఒప్పందం కుదుర్చుకోవడమా? అలా అయితే, దేశ రక్షణ భవిష్యత్తు ఏంటి అని సూటిగా ప్రశ్నించారు. 
 
రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై నిజానిజాలు తెలియాల్సి ఉందని, రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ వాస్తవాలు వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక రకంగా, ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ మరో రకంగా మాట్లాడుతున్నారని, హోలాండ్‌ అబద్ధం చెప్పారా? లేక మన ప్రధాని నిజం చెప్పడం లేదా? అని ప్రజలకు తెలియాల్సి ఉందని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు.