శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (10:59 IST)

రాఫెల్ రచ్చ : మోడీ సిఫార్సు వల్లే రిలయన్స్‌కు కట్టబెట్టాం : హోలాండే

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం కీలక మలుపు తిరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకే రిలయన్స్‌ను భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం కీలక మలుపు తిరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకే రిలయన్స్‌ను భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్టు విపక్ష పార్టీలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఇపుడు సరికొత్త కోణం వెలుగుచూసింది.
 
రూ.58 వేల కోట్ల రాఫెల్ ఒప్పందంలో ఫైటర్‌జెట్ విమానాల తయారీ సంస్థ దస్సాల్ట్ ఏవియేషన్‌కు భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థను చేర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే తమకు సూచించారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
నరేంద్ర మోడీ ప్రతిపాదనతో తమకు (ఫ్రాన్స్‌కు) మరో సంస్థను భాగస్వామిగా చేర్చుకునే అవకాశం లేకుండా పోయిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలను మీడియాపార్ట్ అనే ఫ్రెంచ్ పత్రిక ప్రచురించింది. రాఫెల్ డీల్‌లో విదేశీ భాగస్వామికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం మాకు లేదు. 
 
రిలయన్స్ డిఫెన్స్ సంస్థను ప్రధాని మోడీయే ప్రతిపాదించారు. దీంతో దస్సాల్ట్ ఏవియేషన్ అనిల్ అంబానీ సంస్థతో చర్చలు జరిపింది. మాకు మరో అవకాశం లేకుండా పోయింది. మాకు మోడీ సూచించిన భాగస్వామినే మేం చేర్చుకున్నాం అని హోలాండే పేర్కొన్నట్టు మీడియాపార్ట్ వెల్లడించింది.
 
కాగా, హోలాండే ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2015లో 36 రాఫెల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ ఒప్పందంలో ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను కాదని ఎటువంటి అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా ఎంపిక చేయడంపై ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. హోలాండే తాజా వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.