బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (10:07 IST)

గర్భంతో ఉన్న భూమా అఖిలప్రియ : చెంచల్‌గూడ జైలుకు ... బెయిల్ సంగతేంటి?

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డి ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. అయితే, ఈ కేసులో ఆమెకు న్యాయస్థానం ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, ఆమె తరపు న్యాయవాదులు మాత్రం బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరుగనుంది. 
 
ఈ క్రమంలో అఖిలప్రియ గర్భిణి కావడంతో దాని‌పై ఉత్కంఠ నెలకొంది. ఆమెను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆమె భ‌ర్త భార్గవ్ రామ్ ఆచూకీ ఇప్ప‌టికీ దొర‌క‌లేదు. ఆయ‌న కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చ‌ర్య‌లను కొన‌సాగిస్తున్నారు.
 
మరోవైపు, బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. 
 
అయితే, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఏవీ సుబ్బారెడ్డి వాదిస్తున్నారు. ఏ1గా ఎందుకు చేర్చారో కూడా అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. ప్రవీణ్‌తో విభేదాలు వచ్చినవి వాస్తవమే అన్న సుబ్బారెడ్డి.. మిస్ కమ్యూనికేషన్ కారణంగా తన పేరు తెర మీదకొచ్చిందన్నారు. 
 
గతంలో తనను చంపడానికి సుపారీ ఇచ్చిన అఖిల ప్రియతో తానెందుకు కిడ్నాప్‌కు ప్లాన్ చేస్తానని ఆశ్యర్యం వ్యక్తం చేశారు. హఫీజ్‌పేట వ్యవహారంలోనే కిడ్నాప్ చేశారా లేక వ్యక్తిగత కారణాలతోనే కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తే అసలు నిజాలు బయటపడుతాయన్నారు. 
 
అయినప్పటికీ, పోలీసులు సుబ్బారెడ్డిని ఏ1గానే పరిగణించి అరెస్ట్ చేయడంతో బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. కాగా, ఇదే కేసులో టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త భార్గవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.