సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (13:04 IST)

రేప్ చేశారు.. ఎముకలు విరగ్గొట్టి... ప్రైవేట్ భాగాల్లోకి ఇనుపరాడ్లు నెట్టారు!

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగిపోతూనేవున్నాయి. తాజాగా ఢిల్లీ నిర్భయ తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌని జిల్లాలో జరిగింది. 50 యేళ్ళ మహిళపై అత్యాచారం చేసిన ముగ్గురు కామాంధులు ఆమె ఎముకలు విరగ్గొట్టి, ఆపై ప్ర‌ైవేటు భాగాల్లోకి ఇనుప‌రాడ్ల‌ను నెట్టి హ‌త్య చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బ‌దౌన్ జిల్లాలోని ఉగైతి ప్రాంతానికి చెందిన ఓ 50 యేళ్ల మ‌హిళ వృత్తిరీత్యా అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌గా పనిచేస్తోంది. ఆమె స్థానికంగా ఉన్న ఓ దేవాల‌యానికి ప్ర‌తిరోజు వచ్చి వెళ్లేది. అలాగే ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఆలయానికి వెళ్లింది. 
 
అక్కడ ఆలయ పూజారితో పాటు మ‌రో ఇద్ద‌రు క‌లిసి ఆమెను నిర్బంధించారు. ఆ త‌ర్వాత ముగ్గురు క‌లిసి ఆమెపై అత్యాచారం చేశారు. ప్ర‌ైవేటు భాగాల్లోకి ఇనుప‌రాడ్లు నెట్టి, అత్యంత క్రూరంగా ప్ర‌వ‌ర్తించి పైశాచిక ఆనందం పొందారు. 
 
ఇక పూజారి చేసిందంతా చేసి త‌న‌కేమీ తెలియ‌న‌ట్లు నాట‌క‌మాడాడు. ఆల‌యానికి వ‌చ్చిన మ‌హిళ ప్ర‌మాద‌వ‌శాత్తు అక్క‌డున్న బావిలో ప‌డిపోయింద‌ని కట్టుకథ అల్లాడు. అక్క‌డే ఉన్న మ‌రో ఇద్ద‌రి స‌హాయంతో బావిలో నుంచి ఆమెను బ‌య‌ట‌కు తీసుకొచ్చామ‌ని చెప్పాడు. 
 
ఆ తర్వాత రాత్రి 11:30 గంట‌ల స‌మ‌యంలో ఆమెను ఇంటికి తీసుకొచ్చి వ‌దిలిపెట్టి వెళ్లామ‌ని తెలిపాడు. అప్ప‌టికీ ఆ మ‌హిళ ప్రాణాల‌తో ఉందని చెప్పాడు. అయితే, బాధిత మ‌హిళ‌కు తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అప్ప‌టికే ఆమె మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అనంత‌రం ఆమెకు పోస్టుమార్టం నిర్వ‌హించ‌గా అత్యాచారానికి గురైన‌ట్లు తేలింది. ఆ మహిళ పట్ల కామాంధులు అత్యంత దారుణంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో తేలింది. ఆమె ప్ర‌ైవేటు భాగాల్లోకి ఇనుప‌రాడ్లు నెట్ట‌డంతో ఊపిరితిత్తులు దెబ్బ‌తిన్నాయి. ప‌లు ఎముక‌లు విరిగిపోయాయి. ఓ కాలు కూడా విరిగిపోయిన‌ట్లు నివేదిక‌లో వెల్ల‌డైంది. 
 
ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ కేసులో పూజారితో పాటు మ‌రొక‌రిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్థానికులకు హామీ ఇచ్చారు.