శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జనవరి 2021 (13:54 IST)

నన్ను దూరం పెట్టావుగా.. అందుకే పురుగుల మందు తాగాను!

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేటలో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. వివాహమై ఐదు నెలలైనా గడవకముందే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. వివాహమైన కొత్తల్లో బాగా చూసుకున్న భర్త.. క్రమంగా దూరం పెట్టడంతో పాటు.. వరకట్నం తీసుకునిరావాలంటూ వేధించడంతో మనస్తాపానికి లోనైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రణయ్‌ అనే వ్యక్తి నల్గొండ జిల్లా కొర్లపాడుకు చెందిన లావణ్య అనే యువతిని ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లికి ముందు బాగా చూసుకున్న ప్రణయ్‌, వివాహం జరిగినప్పటి నుంచి లావణ్యను వేధించసాగాడు. 
 
అదనపు కట్నం తీసుకు రమ్మని ఒత్తిడి చేశాడు. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి నమ్మించి మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య శనివారం పురుగుల మందు సేవించింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
 
అయితే, ఆమె పురుగుల మందు సేవించే ముందు భర్తతో ఫోనులో మాట్లాడింది. 'నన్ను ఎందుకు దూరం పెట్టావు. ఎక్కడ ఉన్నావ్‌. నేను పురుగుల మందు తాగాను' అంటూ లావణ్య చివరగా భర్తతో మాట్లాడింది. దీనికి సంబంధించిన ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 
 
తమ కూతురు ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ కట్నకానుకలు ముట్టజెప్పామని, అయినా అదనపు కట్నం కావాలంటూ ప్రణయ్‌ వేధించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ బిడ్డ చావుకు ప్రణయ్‌ వేధింపులే కారణమని తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.