లావణ్య: ఏం చేస్తున్నావు?
ప్రణయ్: ఏమైంది?
లావణ్య: నువ్వు నన్నెందుకు వదిలేశావు? (ఏడుస్తూ....మధ్యలో వాంతి చేసుకుంటున్నట్లుగా శబ్దాలు)
ప్రణయ్: హలో... హలో... గొంతేమిటి అలా ఉంది?
లావణ్య: నేను పురుగుల మందు తాగిన
ప్రణయ్: ఏడుస్తున్నావు?ఎందుకు తాగావు?
లావణ్య: నువ్వు నన్ను వదిలేసినావు కదా!
ప్రణయ్: ఓర్నీ ? ఇంట్లో ఎవరున్నారు?
ఇవి నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ గ్రామానికి చెందిన ఎడ్ల లావణ్య పురుగుల మందు తాగిన తర్వాత భర్తతో ఫోనులో మాట్లాడిన ఆఖరి మాటలు. మరికొన్ని క్షణాల తర్వాత ఆమె గొంతు మూగబోయింది. భర్త వదిలేశారనే కారణంతో ఆమె పురుగుల మందు తాగి ఆదివారం సాయంత్రం మరణించారు. అయితే దీనికంతటికీ లావణ్య అత్తింటి వారు పెట్టిన వరకట్న వేధింపులే కారణమని లావణ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగింది?
ఆమె పురుగుల మందు తాగడానికి దారి తీసిన పరిస్థితుల గురించి లావణ్య బాబాయి ఎడ్ల ప్రవీణ్ బీబీసీ న్యూస్ తెలుగుతో చెప్పారు. ఎడ్ల లావణ్య (21 సంవత్సరాలు) వెటర్నరీ మెడిసిన్ కోర్సు పూర్తి చేశారు. ఆమెకు మూడేళ్ళ క్రితం సూర్యాపేటకు చెందిన పెద్దపంగ ప్రణయ్‌తో పరిచయం అయింది. వీరిద్దరూ ప్రేమలో పడినప్పటికీ లావణ్య ఇంట్లో అతనితో వివాహానికి సుముఖత చూపించలేదు.
ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పోవడంతో లావణ్య మౌనంగా ఉండిపోయారు. ఆ సమయంలోనూ ప్రణయ్ "నన్ను కాకుండా ఇంకెవరినైనా ఎలా చేసుకుంటావని బెదిరిస్తూ ఉండేవారు" అని ఆమె బాబాయి చెప్పారు. అయితే, ఆ బెదిరింపులను ఆమె ప్రేమగా భావించారు. దాంతో, ఆమె ఇంట్లో వాళ్లకి ప్రణయ్ తల్లితండ్రులతో తమ వివాహ విషయం మాట్లాడమని ఒప్పించినట్లు చెప్పారు.
పెళ్లి విషయమై చర్చించేందుకు మొదటిసారి ప్రణయ్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తమకు అవమానాలు ఎదురయ్యాయని ప్రవీణ్ చెప్పారు. "మీరేం కట్న కానుకలు ఇవ్వగలరు?" అంటూ ఇంటికి వెళ్లిన తమతో అమర్యాదగా ప్రవర్తించారని ఆయన చెప్పారు. కోవిడ్ లాక్ డౌన్ ముగియగానే, ప్రణయ్ కుటుంబ సభ్యులు చీర, సారెతో ఇంటికి వచ్చి నిశ్చితార్ధం చేసుకున్నారు. లావణ్య ప్రణయ్‌ల వివాహం 2020 జూన్ 12న జరిగింది.
అయితే, ఇది ప్రేమ వివాహమైనప్పటికీ, కట్న కానుకల విషయంలో మాత్రం ఎటువంటి రాజీ పడలేదన్నారు. పెళ్లి సమయంలో అర ఎకరం భూమి, 10 తులాల బంగారం ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. కానీ, మరో 2 తులాల బంగారం మాత్రం ఇంకా పెట్టాల్సి ఉందని తెలిపారు.
వేలు విరిచేశారు
పెళ్ళైనప్పటి నుంచి లావణ్యకు అత్తగారింట్లో వరకట్నపు వేధింపులు మొదలయినట్లు ప్రవీణ్ చెప్పారు. "మా అబ్బాయి పెళ్ళికి చాలా ఖర్చు అయింది. వేరే సంబంధం చేసి ఉంటే మాకు కొన్ని లక్షల కట్నం వచ్చి ఉండేది" అని లావణ్య అత్త మామలుగానే ఆమెను సూటి పోటి మాటలు అంటూనే ఉండేవారని చెప్పారు. ఆమె ఇష్టపడి చేసుకున్న వివాహం కావడంతో ఆమె ఈ విషయాలేవీ ఇంట్లో వాళ్ళతో పంచుకోలేదని చెప్పారు.
క్రిస్మస్ నాటికి వేధింపులు మరింత పెరిగాయి.
లావణ్య పుట్టింటి వారు పండగకు అల్లుడుకి కొత్త బట్టలు పెట్టలేదని సాధింపులు మొదలయ్యాయి. ఈ విషయం తెలిసి లావణ్య తండ్రి అమ్మాయి ఇంటికి వెళ్లి కానుకల కోసం డబ్బులిచ్చి జనవరి 01 న కొత్త సంవత్సరానికి ఇంటికి రమ్మని పిలిచి వచ్చినట్లు ప్రవీణ్ చెప్పారు. కానీ, వారికి లావణ్య తల్లితండ్రులు ఇవ్వవలసిన రెండు తులాల బంగారం పైనే మనసుందని ప్రవీణ్ చెప్పారు.
"మీ అమ్మ నాన్న ఇవ్వాల్సిన బంగారం బాకీ తీరలేదు. నువ్వు ఇక్కడే ఉంటే వారెప్పటికీ ఆ రెండు తులాలు ఇవ్వరు అంటూ ఇంట్లో తలకి స్నానం చేసి మంచంపై పడుకుని ఉన్న లావణ్యను బరా బరా ఈడ్చుకుంటూ బండి ఎక్కించుకుని పుట్టింటి బయటే వదిలేసి వెళ్లిపోయారు" అని లావణ్య బాబాయి చెప్పారు.
"ఆ మరుసటి రోజు పొద్దునే లావణ్య నన్ను కలిసి, ఆమెకు పెళ్ళైన దగ్గర నుంచి అత్తింట్లో జరిగిన విషయాలన్నీ చెప్పింది. నేనామెకు ధైర్యం చెప్పి వారితో మాట్లాడతానని చెప్పి సొంత పనులపై బయటకు వెళ్లిపోయాను" అని ఆయన తెలిపారు. ''ఈ ఆదివారం మధ్యాహ్నం ప్రణయ్ నుంచి ఫోన్ వచ్చింది. "లావణ్య ఏదో మందు తాగింది" వెంటనే ఇంటికి వెళ్ళమని చెప్పారు. పరుగు పరుగున ఇంటికి వెళ్లి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళేసరికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు" అని ప్రవీణ్ చెప్పారు.
ఇంత చదువుకుని, స్నేహితులందరికీ ధైర్యం చెబుతూ ఉండే అమ్మాయి ఇలా చేయడాన్ని ఆమె స్నేహితులు కూడా జీర్ణంచుకోలేకపోతున్నారని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పదిహేను రోజుల క్రితం కూడా ప్రణయ్ లావణ్య వేలిని విరిచేసిన విషయాన్ని ఆమె స్నేహితురాలితో పంచుకుందని, ఆమె స్నేహితురాలు ఇప్పుడు చెబుతోందని ప్రవీణ్ చెప్పారు.
అయితే, అమ్మాయి మరణించిన వెంటనే ప్రణయ్ ఆత్మహత్యాయత్నం చేసి ఇప్పుడు హైదరాబాద్‌లోని సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి
ఆయన కూడా విషం తీసుకుని ఇప్పుడు ఐసియూలో చికిత్స పొందుతున్నారని సన్ రైజ్ హాస్పిటల్స్ వారు బీబీసీకి తెలిపారు. మరే ఇతర వివరాలు ఇవ్వకుండానే ఫోను పెట్టేశారు. కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో ప్రణయ్‌పై, అతని కుటుంబ సభ్యులపై సెక్షన్ 304 బి కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.
ప్రస్తుతానికి కేసు నమోదు చేసి, ప్రణయ్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడగానే ఆయనను, కుటుంబ సభ్యులను అదుపులో తీసుకుని విచారణ చేస్తామని సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ బీబీసీ న్యూస్ తెలుగుతో చెప్పారు. అత్తింటి వారిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించగా, వారెవరూ అందుబాటులో లేరని, ఆ కుటుంబ సభ్యులంతా పరారీలో ఉన్నారని ఎస్‌ఐ చెప్పారు.
'పెళ్లే జీవితం కాదు'
దేశ వ్యాప్తంగా 2019లో 7,115 వరకట్న సంబంధిత మరణాల కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో 112 మరణాలు, తెలంగాణాలో 163 మరణాలు చోటు చేసుకున్నాయి. 2020 జులైలో ఖైరతాబాద్‌లో 25 ఏళ్ల మహిళ వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వరకట్న వేధింపుల సమస్యలపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కి కానీ, స్థానికంగా ఉన్న మహిళా సెల్‌కి కానీ వెళ్లి కేసు నమోదు చేయవచ్చు.
“అమ్మాయిలు నచ్చిన వ్యక్తిని ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి గాని చేసిన ధైర్యం జీవించడానికి చేయలేకపోతున్నారు” అని అంటున్నారు భూమిక విమెన్స్ కలెక్టివ్ చీఫ్ ఫంక్షనరి కొండవీటి సత్యవతి. "నేను స్వతంత్రంగా బతకగలను అనే భరోసా ఇచ్చే పరిస్థితులు సమాజంలో లేకపోవడం కూడా ఇలాంటి పరిస్థితులకు కారణం" అని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమే, కానీ పిల్లలు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వారి నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా వారు తీసుకునే నిర్ణయాలకు పర్యవసానాలు, వాటిని ఎదుర్కోవడానికి కావల్సిన ధైర్యాన్ని తల్లితండ్రులు ఇవ్వగలగాలని ఆమె అన్నారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నప్పుడు తమ చుట్టూ ఉండే సహకార వ్యవస్థ గురించి తెలుసుకుని ఉండటం చాలా ముఖ్యం అని ఆమె అన్నారు.
"చాలా మంది ఎంత పెద్ద చదువులు చదివినా జీవితానికి ఉపయోగపడే చదువును అలవర్చుకోలేకపోవడం దురదృష్టకరం" అని అన్నారు. "ఈ యుగంలో కూడా చదువుకుని లక్షల జీతాలు సంపాదిస్తున్న అమ్మాయిలు కూడా గృహ హింసను ఎదుర్కొంటున్నారంటే దానికి పితృస్వామ్య భావజాలమే కారణం. పెళ్లి చుట్టూ పితృస్వామ్య సమాజం అల్లేసిన మానసిక, నైతిక కట్టుబాట్లను ఉల్లంఘిస్తే ఏమి జరుగుతుందో అనే భయం మాత్రం ఇంకా చాలామంది అమ్మాయిలను వేటాడుతోంది" అని ఆమె అన్నారు.
లావణ్య విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రాణాలు తీసుకోవడానికి బదులు 'సఖి' లాంటి ప్రభుత్వ వ్యవస్థల సహాయం తీసుకుని ఉండాల్సింది అని అన్నారు. "ప్రేమ, పెళ్లి జీవితానికి మించినవి కావు. జీవితానికి భర్త, కుటుంబం ఒక ఆలంబనే కానీ, అవే జీవితం కాదు" అని అమ్మాయిలు అర్ధం చేసుకోగలగాలని ఆమె చెప్పారు.
మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికిహెల్ప్‌లైన్ నంబర్ 08046110007