వరద బాధితులకు అండగా అక్షయ పాత్ర.. ఖాతాలో అరుదైన రికార్డ్
అక్షయపాత్ర వంటశాలలో వరద బాధితుల కోసం ఐదు లక్షల ఫుడ్ ప్యాకెట్లు సిద్ధం చేసింది. అక్షయపాత్ర మరో అరుదైన రికార్డును సాధించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని హరేరామ హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే అక్షయ పాత్ర వరద బాధితుల కోసం భారీగా ఆహార పొట్లాలను పంపిణీ చేసింది.
ప్రభుత్వం, దాతల సహకారంతో ఈ అరుదైన రికార్డు సాధించామని అక్షయపాత్ర అధికారి విలాస దాసప్రభు చెప్పారు. గుంటూరు, చిలకలూరిపేట, తెనాలి పురపాలక సంఘం నుంచి రోజుకు 400 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
ఆహారాన్ని బాధితుల వద్దకు చేరేవేసేందుకు ఆయా పాఠశాలలు, కళాశాలల యజమానులు ఉచితంగా వాహనాలు పంపుతున్నారు.
విజయవాడలోని సింగ్ నగర్, ప్రకాష్ నగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాలలోని వరద బాధితుల కోసం శ్రీ సాయిమంగ భరద్వాజ సేవ సంస్థానం అక్షయ పాత్ర ఆహార పంపిణీ కోసం ఆహార పొట్లాలను సిద్ధం చేస్తోందని.. ఆహారం సిద్ధం చేసి, ప్యాకింగ్ చేయడంలో వాలంటీర్లు పాలు పంచుకుంటున్నారని అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా 6 లక్షల మందికి భోజనం తయారు చేసి పంపిస్తున్నట్లు విలాస దాసప్రభు వెల్లడించారు.