మనం బతికుండి కూడా చనిపోయినట్లే: చంద్రబాబు
‘సేవ్ ఏపీ..సేవ్ అమరావతి’ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ నల్ల చొక్కా ధరించి 24 గంటల రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన చేపట్టిన దీక్షకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వం కమిటీలపై కమిటీలు వేస్తూ.. ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మరోవైపు ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని, దానిపై న్యాయ విచారణ జరపాలని కూడా చెబుతున్నామని, తప్పు జరిగినట్లు నిర్ధారణ జరిగితే శిక్షించాలన్నారు.
అంతేకాని, ఇన్‌సైడర్ పేరు చెప్పుకుని ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే ఖబడ్దార్ జాగ్రత్త అని చంద్రబాబు హెచ్చరించారు. అన్ని ప్రాంతాలు కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని చెబుతున్నాయని, ఇప్పటికైనా సీఎం జగన్‌కు జ్ఞానం రావాలన్నారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, మూడు రాజధానులు కాదని అన్నారు. విభేదాలు సృష్టించి రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్నారని, అమరావతికి ద్రోహం చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదని చంద్రబాబు అన్నారు.
అమరావతి ప్రజల పోరాటానికి యువత మద్దతివ్వాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. అమరావతి జేఏసీకి ప్రజలే విరాళాలు ఇవ్వాలన్నారు. మన పిల్లలు వేరే ప్రాంతానికి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఆనాడు అమరావతికి శ్రీకారం చుట్టామన్నారు. ధైర్యంగా పోరాడితే చరిత్రలో మిగులుతామన్నారు. అమరావతిని మనం బతికించుకోకపోతే..మనం బతికుండి కూడా చనిపోయినట్లేనని చంద్రబాబు అన్నారు.
సీఎం, మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. తనపై ఉన్న కోపాన్ని అమరావతిపై చూపించవద్దని సూచించారు. అమరావతిలో ఇప్పటికే అనేక భవనాలు ఉన్నాయని, అమరావతిలో పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ రాజధాని వద్దని అని జిల్లాల ప్రజలు కోరుతున్నారని, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు విశాఖ దూరంగా ఉందని అన్నారు. అమరావతిలో పునాదులకు ఎక్కువ ఖర్చు అని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు.