ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 మే 2022 (18:24 IST)

మంత్రి బొత్సకు వార్నింగ్.. సచివాలయానికి ఎలా వస్తారో చూస్తాం

Botsa
రాజధాని అమరావతి రైతులతో చర్చల ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ  వ్యాఖ్యానించారు. కేవలం 20 గ్రామాలకు, ఓ సామాజిక వర్గానికి రాష్ట్ర భవిష్యత్తుని పరిమితం చేయాలా? అంటూ ప్రశ్నించారు. బొత్స చేసిన వ్యాఖ్యలపై అమరావతి దళిత జేఏసీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి తర్వాత దహనం చేశారు.
 
బొత్స సత్యనారాయణ కేవలం తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి, సీఎం జగన్మోహన్‌రెడ్డి మెప్పు పొందడానికి రాజధాని ప్రాంత రైతుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.  
 
మరో రెండు నెలల్లో బొత్స మంత్రి పదవి ఉంటుందో.... ఊడిపోతుందో తేలిపోతుందన్నారు. దాన్ని నిలబెట్టుకోవడానికే ఆయన అమరావతిపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఉంటూ రైతులను చర్చలకు పిలిచేది లేదనడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
రాజధాని అమరావతిలో ఓ సామాజిక వర్గం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. లేదంటే ఆయన సచివాలయానికి ఎలా వస్తారో చూస్తామని దళిత జేఏసీ నేతలు హెచ్చరించారు.