వేదనల మధ్య వేడుకలు వద్దు .. నారా లోకేశ్
తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించరాదంటూ పార్టీ శ్రేణులకు టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. రాజధాని తరలింపు నిర్ణయంతో ప్రజారాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు, రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మూడు రాజధానుల పేరుతో నాశనం చేయొద్దని శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. వికేంద్రీకరణ పేరుతో విద్వేషాలు రాజేయొద్దని వేడుకుంటున్నారు.
ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పోలీసులను ప్రయోగించి శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ప్రజల్ని నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. నిర్బంధిస్తోంది. దాడులు చేయిస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల మధ్య ప్రజలు వేదనల్లో ఉంటే పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం సమంజసం కాదు. అందుకే నా పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. నా జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులెవ్వరూ ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దని కోరుతున్నాను.
ఉద్యమిస్తున్న రైతులు, రైతు కూలీలకు అండగా నిలవడమే మీరు నాకు అందించే జన్మదిన కానుకలుగా భావించండి. జై అమరావతి అని ప్రతీ ఒక్కరూ నినదించండి. పుట్టినరోజు వేడుకల కోసం వెచ్చించాలనుకున్న సొమ్మును అమరావతి పరిరక్షణ ఉద్యమానికి విరాళంగా ఇవ్వండి. అభివృద్ధి వికేంద్రీకరణ ముద్దు..పాలనా వికేంద్రీకరణ వద్దు..ఆంధ్రుల రాజధాని నాడు నేడు ఎప్పటికీ అమరావతే అని నినాదాలివ్వండి. కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే అసలైన పుట్టినరోజు వేడుక అంటూ నారా లోకేశ్ ట్వీట చేశారు.