సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (12:46 IST)

జగన్‌ను బూతులు తిట్టిస్తారా? వైఎస్సార్ లాంటి మరణం కావాలని కోరుకుంటా?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కొంతమంది బూతులు తిట్టిస్తున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో దివంగత వైఎస్సార్‌ను, ఆయన కుటుంబ సభ్యులను బూతులు తిట్టిస్తున్నారని.. రాజశేఖర్ రెడ్డి మరణం గురించి కూడా కొంతమంది అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
 
వైఎస్సార్ లాంటి మరణం తనకు వస్తే.. లేదా దేవుడు అడిగితే.. తనకు ఆ మరణం కావాలని కోరుకుంటానని కొడాలి నాని చెప్పారు. పుట్టిన ప్రతీ ఒక్కరు మరణిస్తారంటూ.. వైఎస్సార్ చనిపోయినా బ్రతికున్నారని పేర్కొన్నారు. అలాంటి అదృష్టం అందరికీ రాదని చెప్పుకొచ్చారు. 
 
వైఎస్సార్ మరణించినప్పటికీ.. ప్రజల గుండెల్లో బ్రతికున్న దేవుడు రాజశేఖర్ రెడ్డని నాని వెల్లడించారు. అటువంటి రాజశేఖర్ రెడ్డిని గురించి తప్పుగా మాట్లాడటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. ఆయన మరణం తర్వాత వైకాపా స్థాపించిన జగన్‌ను కడపలో ఐదు లక్షల నలభై ఐదువేల మెజార్టీతో ప్రజలు గెలిపించారన్నారు. 
 
రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి జగన్‌ను సీఎం చేశారని నాని గుర్తు చేశారు. చంద్రబాబులా బతకడం కంటే.. వైఎస్సార్ లాంటి చావే గొప్పది.. అదే తన కోరిక అని కొడాలి నాని తెలిపారు.