శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (10:56 IST)

రాజధాని అమరావతి గ్రామాల్లో బంద్ .. మా పోరాటం ఆగదంటున్న రైతులు

రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులు, మహిళలపై సోమవారం అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసుల లాఠీచార్జికి నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి రాజధాని గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు.
 
మంచినీరు సహా ఏ పదార్థాలు పోలీసులకు విక్రయించరాదని నిర్ణయించుకున్నట్లు వ్యాపారులు తెలిపారు. పోలీసులు అడ్డుకుంటే జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని రాజధాని రైతులు నిర్ణయించారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
 
మా పోరాటం ఆగదు: రైతులు 
మూడు రాజధానులకు అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదం తెలపడంపై రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మందడంలో ఉదయం నుంచి రైతుల నిరసనకు దిగారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన తమ పోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు. సీఆర్డీఏకు నిన్న మధ్యాహ్నం వరకు అభిప్రాయాలు తెలిపే అవకాశం కోర్టు ఇచ్చిందని... కోర్టు తీర్పునకు విరుద్ధంగా గడువు కంటే ముందే మంత్రి వర్గం ఎలా ఆమోదిస్తుందని ప్రశ్నించారు. గడువుకంటే ముందే బిల్లును అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారని రైతులు నిలదీశారు.