శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (15:20 IST)

తెలంగాణ బంద్ సంపూర్ణం : ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ

తెలంగాణ బంద్ సంపూర్ణమైనట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని శనివారం జేఏసీ నేతలు ఓ ప్రకటనను విడుదలచేశారు. బంద్‌కు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 
 
అదేసమయంలో బంద్ సందర్భంగా తెరాస సర్కారు చేయించిన అక్రమ అరెస్టులను నేతలు ఖండించారు. భౌతికదాడులు చేయడం సరికాదని హితవు పలికారు. నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై భవిష్యత్ కార్యాచరణను సాయంత్రం ప్రకటిస్తామని కార్మిక సంఘాలు వెల్లడించాయి. 
 
మరోవైపు, ఆర్టీసీ బంద్‌ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య హౌస్‌ అరెస్ట్ చేశారు. వీ హనుమంతరావు, మధుయాష్కీ, కూన శ్రీశైలం గౌడ్ ఇంటి ఎదుట పోలీసులను భారీగా మోహరించారు. జేబీఎస్‌ దగ్గర టీజేఎస్ అధినేత కోదండరామ్‌, టీడీపీ నేతలు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. 
 
సీపీఐ ఆఫీసులో ఆ పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌ పాషా అరెస్ట్ చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సీపీఎం నేత తమ్మినేని అరెస్ట్ చేశారు. ఎంజీబీఎస్‌ దగ్గర ఆర్టీసీ జేఏసీ నేత హనుమంతు సహా పలువురు నేతల అరెస్ట్ చేశారు.
 
అదేవిధంగా, ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో పాల్గొనని వారంతా తెలంగాణ ద్రోహులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అబిడ్స్‌లో బీజేపీ నేతలు లక్ష్మణ్‌, రామచంద్రరావు అరెస్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు. హరీశ్‌రావు, ఈటలకు పదవులు శాశ్వతం కాదన్నారు. 
 
పదవులు ముఖ్యమో? ప్రజలు ముఖ్యమో? టీఆర్‌ఎస్‌ నేతలు తేల్చుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక విధానాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వంలో చలనంలేదన్నారు. గవర్నర్‌ సీరియస్‌ అయినా కేసీఆర్‌కు చీమకుట్టినట్టైనా లేదని తెలిపారు.