శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (16:22 IST)

తుళ్ళూరులో మహిళా రైతులపై ఖాకీ జులం.. జాతీయ మహిళా కమిషన్ కన్నెర్ర

రాజధాని తరలింపునకు వ్యతిరేంగా అమరావతి ప్రాంత రైతులు గత 24 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లోభాగంగా, శుక్రవారం అనేక మంది మహిళలు తుళ్లూరు సెంటర్‌ నుంచి ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ, పోలీసులు మాత్రం వారిని అడ్డుకుని కిందకు తోసేశారు. మహిళల్ని పోలీసులు తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారని, దురుసుగా ప్రవర్తించారు. అప్పటికీ వారు కదలకపోవడంతో వారిపై లాఠీఛార్జ్ చేశారు. 
 
వీటికి సంబంధించిన కొన్ని ఫుటేజీలు పలు మీడియా చానళ్లలో ప్రసారమయ్యాయి. ఈ కథనాలను కూడా కమిషన్ పరిశీలించింది. ఈ అంశాన్ని సుమోటాగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్.. నిజ నిర్ధారణ కోసం ఒక కమిటీని అమరావతి తుళ్లూరుకు శనివారం పంపించనుంది. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే స్థానిక పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీచేసింది. 
 
అంతకుముందు శుక్రవారం ఉదయం అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఇందులోభాగంగా, భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించింది. ప్రధానంగా, నిరసనల్లో భారీ ఎత్తున పాల్గొంటున్న మహిళలను నియంత్రించడంకోసం అధిక సంఖ్యలో మహిళా పోలీసులు, హోంగార్డులను రంగంలోకి దించింది. 
 
ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న మహిళా పోలీసులకు తోడుగా మహిళా హోంగార్డులను అమరావతి ప్రాంతానికి తరలించారు. అమరావతి చేరుకున్న హోంగార్డులు వీధుల్లో కవాతు చేశారు. ఆందోళనలు అమరావతి ప్రాంత గ్రామాలకు విస్తరించడంతో మహిళల హోంగార్డులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.