గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 4 మే 2021 (22:21 IST)

అమెరికన్ హాస్పిటల్‌లో కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

గిఫెర్డ్ మెమోరియల్ (అమెరికన్ ) ఆసుపత్రిలో కోవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగైన్ అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం గిఫెర్డ్ మోమోరియాల్ (అమెరికన్) ఆసుపత్రిలో కోవిడ్ విభాగం పనితీరుపై శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తో కలిసి వైద్యాధికారులు, నోడల్ అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగైన్ మాట్లాడుతూ కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారించబడి వ్యాధి లక్షణాలు కలిగిన వారు 104 నెంబర్‌కి ఫోన్ చేసిన వారికి  అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఆసుపత్రిలోని రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించడం జరిగిందని, సదరు నోడల్ అధికారి రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చికిత్స అందేలా వైద్యాధికారులతో సమన్వయము చేసుకోవాలన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజెన్, వెంటిలేటర్ సౌకర్యాలు త్వరలో అందుబాటులోనికి వచ్చేలా వైద్యాధికారులు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెమిడీసివెర్ వంటి అత్యవసర మందులకు ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో  కోవిడ్  పాజిటివ్ సోకిన పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, చికిత్స నిమిత్తం విజయవాడ వంటి నగరాలకు వెళ్లినప్పటికీ ఆసుపత్రులలో బెడ్స్ దొరకక ఎన్నో బాదలు పడుతున్నారన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళితే నూజివీడు లోని గిఫెర్డ్ మోమోరియాల్ (అమెరికన్) ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా గుర్తిస్తూ మంజూరు చేశారన్నారు.

ఆసుపత్రిలోని కోవిడ్ విభాగంలో నూజివీడు నియోజకవర్గంలో కోవిడ్ పాజిటివ్‌తో బాధపడుతున్నపేదవారికీ చికిత్స అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆక్సిజెన్, వెంటిలేటర్ సౌకర్యాలు త్వరగా అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రతాప్ అప్పారావు అధికారులకు సూచించారు.

సమావేశంలో డిఎస్పీ బి. శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. డి. ఆశా, నూజివీడు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. నరేంద్ర సింగ్, పంచాయత్ రాజ్ ఈఇ ఏడుకొండలు, పట్టణ  సి.ఐ. వెంకటనారాయణ, గిఫెర్డ్ మోమోరియాల్ ఆసుపత్రి ఏ.ఓ. ప్రసంగి, డివిజినల్ పరిపాలనాధికారి ఎం. హరనాధ్, తహసీల్దార్ ఎం. సురేష్ కుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.