రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు తీవ్రరూపం.. భూములను త్యాగం చేస్తే? (video)
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇవాళ కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతి రైతులు నిరసనలు ఉద్ధృతం చేశారు. పోలీసు ఆంక్షలు, కాకీ కవాతులు, ముళ్ల కంచెలను లెక్క చేయకుండా సచివాలయం రెండో గేటు సమీపానికి రైతులు దూసుకొచ్చారు.
మందడం నుంచి పొలాల మీదుగా చిన్నా పెద్దా అక్కడికి తరలివచ్చారు. దారివెంబడి ఉన్న ముళ్ల చెట్లను దాటుకొని భారీగా తరలివచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.
జాతీయ జెండాను చేతబట్టిన రైతులు, మహిళలు పోలీసుల చర్యను నిరసిస్తూ పంట కాల్వలో దిగి నిరసన చేపట్టారు. ప్రాణ సమానమైన భూములను రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేస్తే.. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడ్డారు.
అలాగే భారీ ర్యాలీగా తుళ్లూరు గ్రామస్థులు అసెంబ్లీ వైపు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేబినెట్ భేటీ నేపథ్యంలో ఏపీ మంత్రి వర్గం రాజధాని వికేంద్రీకరణకు ఆమోదం తెలపడంతో దాన్ని నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామస్థులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రతోపులాట, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల ఆంక్షలను తోసిరాజని కొందరు వారిని నెట్టుకుంటూ అసెంబ్లీ వైపు పరుగుతీశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
అంతకుముందు.. నందిగామ మాజీ ఎమ్మెల్యేను ముందస్తు అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కనిపించలేదు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లలో సౌమ్య కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసుల కళ్ళు కప్పి బైక్ పైన దీక్ష శిబిరానికి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేరుకున్నారు.
జాతీయ జెండా చేతపట్టుకొని కాలినడకన అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు. కానీ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. ఇక నందిగామలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ నిరసనలు తెలియజేస్తున్న టి.యన్.యస్.యఫ్, తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.