ఉత్తరాంధ్ర రాజధాని కోసం వద్దా...?: పవన్ ను నిలదీసిన అవంతి
ఆంధ్రప్రదేశ్ లో అనాదిగా వెనుకబాటుకు గురవుతూ వస్తున్న ఉత్తరాంధ్రకు రాజధాని ప్రకటిస్తే ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం మంచిదికాదని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రాంతంపై ఎంతో ప్రేమున్నట్లు నాటకాలాడిని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజధానిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు.
కేవలం రాజకీయాల కోసమే పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రను వాడుకుంటున్నారని ఆరోపించారు. పవన్ తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. అమరావతిపై ఆయనకు అంత ప్రేమే ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడే పోటీ చేసి ఉండాల్సిందన్నారు. ఉత్తరాంధ్రలోని గాజువాక లో ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు.
విశాఖను రాజధానిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇక్కడి ప్రజలకు పవన్ సమాధానం చెప్పాలన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు ఊ అంటే పవన్ ఊ అంటూ ఉంటాడని... అందులో భాగంగానే విశాఖకు రాజధానిగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
విశాఖ గాజువాకలో సీఎం జగన్ నిర్ణయమైన మూడు రాజధానులను స్వాగతిస్తూ వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. ఇందులో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొని చంద్రబాబు, పవన్ లపై విరుచుకుపడ్డారు.
చంద్రబాబు జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలతోనే నిండిపోయిందన్నారు. తాజాగా మరోసారి కులాలు, మతాలు ప్రాంతాలు పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.
మూడు సార్లు ముఖ్యమంత్రి గా చేసిన చంద్రబాబు కుల ప్రయోజనాల కోసమే పని చేశారని...ఏనాడూ ప్రజా సంక్షేమానికి పని చేయలేదన్నారు. ఇలా కేవలం తన సామాజికవర్గ అభివృద్ధికే ఆయన పాటుపడ్డారని మండిపడ్డారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా ఓట్లు వేస్తేనే బాబు సీఎం అయ్యాడని గుర్తుంచుకోవాలన్నారు. అమరావతి ప్రజలు ఒక్కరు వేస్తే కాలేదని... ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వుండటంలో కూడా ఉత్తరాంధ్ర వాసులు ఓట్లున్నాయని అవంతి తెలిపారు.
ఈ ర్యాలీలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో పాటు వైసిపి నాయకులు తిప్పల వంశీరెడ్డి, దేవన్ రెడ్డి, భారీ స్థాయిలో స్థానికులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.