శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (07:22 IST)

అంగట్లో సినిమా టిక్కెట్లు : ఆన్‌లైన్‌లో విక్రయాలకే ఏపీ సర్కారు మొగ్గు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్ల వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. అంటే సినిమా టిక్కెట్లను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఈ నెల 28వ తేదీన జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. 
 
నిజానికి సినిమా టికెట్ల అమ్మకాలపై ఏపీలో తీవ్రమైన నిరసలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా వాటి విక్రయాలకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 28వ తేదీన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ముందుకెళ్లాలనే నిర్ణయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లు సమాచారం. 
 
ఆర్థిక దుస్థితినుంచి బయట పడేందుకు జగన్‌ ప్రభుత్వం అందినకాడికి అప్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల విక్రయం ద్వారా వచ్చే కమీషన్‌ చూపించి అప్పు తెచ్చేయోచనలో ఉన్న ప్రభుత్వం... ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ పోర్టల్‌ ద్వారా సినిమా టికెట్లను విక్రయించాలని భావించింది. 
 
సెప్టెంబరు మొదటి వారంలో అందుకు సంబంధించిన అధికార కమిటీ ఏర్పాటు చేయడంతో కలెక్షన్లపై ప్రభుత్వ పెత్తనం ఏంటని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే సినీరంగ పెద్దలు ఒప్పుకున్నారని, పారదర్శకత కోసమే ప్రభుత్వం టికెట్లు విక్రయించాలని నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చిన విషయం తెల్సిందే.