ప్రకాశం బ్యారేజీ వద్ద చంద్రబాబు.. ఉత్తర కోస్తాకు అలెర్ట్
ప్రకాశం బ్యారేజీ వద్ద జరుగుతున్న మరమ్మతు పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇటీవల వరదల కారణంగా కొన్ని పడవలు కొట్టుకుపోవడంతో బ్యారేజీకి చెందిన 67, 69వ నంబర్ గేట్‌లకు తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది. ఈ సందర్భంగా, వరదలతో దెబ్బతిన్న గేట్ల వద్ద కొత్త కౌంటర్ వెయిట్‌ల ఏర్పాటుపై సిఎం నాయుడుకు వివరించారు.
ప్రాజెక్టు గేట్ మరమ్మతుల నిపుణుడు కన్నయ్య నాయుడుతో ముఖ్యమంత్రి చర్చలో నిమగ్నమై మరమ్మతుల పురోగతి, కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటర్ల పనితీరుపై ఆరా తీశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రా, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై రోడ్డు రవాణాకు అంతరాయం కలుగుతోంది.
ఉమ్మడి జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరుసగా రెండోరోజు సోమవారం కూడా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో భారీగా వరదనీరు పోటెత్తి రోడ్లు, పొలాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వస్తున్న వరదనీరు కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి
చెరువులు పొంగి పొర్లడంతో ముందుజాగ్రత్త చర్యగా నర్సీపట్నం-తుని మధ్య రహదారిని అధికారులు మూసివేశారు. అటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అలాగే విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కాగా, వరద పరిస్థితిని సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు.
ఇక ఇటీవల కురిన భారీ వర్షాల కారణంగా విజయవాడ, దక్షిణ కోస్తా ఆంధ్రలోని కొన్ని జిల్లాల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసం నుండి ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్ర వరద ముప్పును ఎదుర్కొంటోంది.