తెగని పీఆర్సీ పంచాయతీ - బెట్టువీడిని ఉద్యోగులు.. మెట్టుదిగని సర్కారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ పంచాయతీ ఇప్పట్లో తీరేలా లేదు. ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. అటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా బెట్టువీడటం లేదు. ఈ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. పీఆర్సీ పంచాయతీపై ఉద్యోగ సంఘాలతో ఆరు గంటల పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సానుకూల ఫలితం రాలేదు.
ఈ చర్చల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు 21 ప్రధాన అంశాలపై తమ వాదనలు వినిపించాయి. ఈ చర్చలు గురువారం కూడా జరుగనున్నాయి.
పీఆర్సీ అమలులో చాలా ఆలస్యమైందని, వచ్చే రెండు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. వీలైనంత త్వరగా పీఆర్సీ అమలుపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, ప్రభుత్వం మాత్రం 15శాతం లోపు వేతన పెంపు ఇచ్చేందుకు సమ్మతించగా, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మాత్రం 34 శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.