సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మే 2024 (10:04 IST)

కాయ్‌ రాజా కాయ్‌.. గెలిచేది కూటమేనోయ్‌ - ఏపీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రంలో భారీగా బెట్టింగులు!!

andhra pradesh map
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, సోమవారం పోలింగ్ జరుగనుంది. వీటితో పాటు 25 లోక్‌సభ స్థానాలకు కూడా ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే, ఈ ఎన్నికల్లో పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? అధికారంలోకి వచ్చేదెవరు? ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ఎన్నికల ఫలితాలపై భీమవరం బెట్టింగ్‌ బాబులు కూటమికే మొగ్గు చూపుతున్నారు. అధిక శాతం సీట్లలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారంటూ భారీగా పందేలు కాస్తున్నారు. 
 
నెల రోజుల క్రితం కూటమికి 100-110 సీట్లు అని చెప్పిన వీరంతా తాజాగా లెక్కలు పెంచేశారు. ప్రస్తుతం కూటమి దూకుడును బట్టి 120-130కు పైగా స్థానాలు వస్తాయని 1:2 చొప్పున పందేలు ప్రారంభించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1:5 చొప్పున అంటే రూ.లక్షకు రూ.5 లక్షలు, పులివెందులలో జగన్‌, కుప్పంలో చంద్రబాబు సాధించే మెజారిటీపై 1: 2, వైకాపా, టీడీపీ, జనసేన, బీజేపీ సాధించే సీట్లపై 1:1చొప్పున రూ.కోట్లలో పందేలు సాగుతున్నాయని భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి తెలిపారు. 
 
కోడిపందేలకు వాసికెక్కిన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రూ.లక్షకు రూ.లక్షన్నర, రూ.లక్షకు రూ.5 లక్షలు కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు. చోటా నేతలు, కొందరు వ్యాపారులు మధ్యవర్తుల అవతారమెత్తారు. ఎవరు గెలిచినా తమకు 1 నుంచి 5 శాతం కమీషన్‌ ఇవ్వాలని మాట్లాడుకుంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితోపాటు ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, చిరువ్యాపారులు రూ.50 వేల నుంచి రూ.కోటి వరకు పందేలు కాస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ఎక్కువ పందేలు జరుగుతున్నాయి.
 
అదేసమయంలో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు, నిత్యం వివాదాలతో చర్చనీయాంశమైన ప్రజాప్రతినిధులు బరిలో ఉన్నచోట భారీగా పందేలు సాగుతున్నాయి. రాష్ట్రంలో జోరుగా పందేలు సాగుతున్న టాప్‌ 10 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి, ధర్మవరం ఉన్నాయి. 
 
ఆ తర్వాత స్థానాల్లో నెల్లూరు రూరల్‌, చీరాల, దర్శి, గుంటూరు పశ్చిమం, విజయవాడ సెంట్రల్‌, రాజానగరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం నియోజకవర్గాల్లో తెదేపా-వైకాపా అభ్యర్థుల గెలుపోటములపై రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారు. 
 
పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ 50 వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని కాకినాడకు చెందిన ఒక వ్యాపారి రూ.2.5 కోట్లు దళారి వద్ద ఉంచినట్టు తెలుస్తోంది. ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయంపై 1:2 లెక్కన పందేలు సాగుతున్నాయి. 
 
కుప్పంలో చంద్రబాబు, పులివెందులలో జగన్‌ మెజారిటీపై బెట్టింగులు పంటర్లకు కాసులు కురిపించనున్నాయి. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని ఒకరు పందెం పెడితే కాదు గతంకంటే పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్‌ వేస్తున్నారు. పులివెందులలో జగన్‌ రికార్డు మెజారిటీలపై 1:3 చొప్పున పందేలు సాగుతున్నాయి. వెనక్కి తగ్గుతున్న వైకాపా మద్దతుదారులు!