1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మే 2024 (13:40 IST)

ఏపీలో ముగిసిన పోలింగ్.. హైదరాబాద్‌కు క్యూకట్టిన ఓటర్లు

traffic
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్ళకు వచ్చిన ఓటర్లు.. పోలింగ్ ముగియడంతో తిరిగి తమ సొంతూళ్ళకు బయలుదేరారు. 
 
నిజానికి ఓట్లు వేసేందుకు రెండు రోజుల క్రితమే బయల్దేరిన ఏపీ ప్రజలు హైదరాబాద్ నగరాన్ని దాదాపు ఖాళీ చేశారు. సోమవారం పోలింగ్ ముగిసిపోవడంతో తమ గ్రామాల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.
 
సోమవారం మధ్యాహ్నం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బస్సులు, కార్లు, టూవీలర్లపై ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
 
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. వందల సంఖ్యలో వాహనాలు ఒకేసారి తరలి రావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు జీఎంఆర్ సిబ్బంది చర్యలు చేపట్టింది.
 
ఓటింగ్ నేపథ్యంలో ఈరోజు సెలవుదినం ప్రకటించారు. మంగళవారం వర్కింగ్ డే కావడంతో సోమవారమే ప్రజలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఏపీతో పాటు కోదాడ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్నారు.