శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 మే 2024 (11:04 IST)

రైల్వేకోడూరులో వైకాపా దౌర్జన్యకాండ.. ఈవీఎంల ధ్వంసం... నిలిచిన పోలింగ్

evm's damage
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు. అయితే, అధికార వైకాపా నేతలు, వారి అనుచరులు పలు ప్రాంతాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 
 
కట్టుదిట్టమైన భద్రత ఉన్నా బలవంతంగా పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి అరాచకాలకు ఒడిగడుతున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయిలో జనసేన ఏజెంట్‌ రాజారెడ్డిని వైకాపా నేతలు అపహరించారు. పోలింగ్‌ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లిపోయారు. తమ ఏజెంట్‌ను కిడ్నాప్‌ చేశారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్‌ నిలిచిపోయింది. 
 
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు లోక్‌సభకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్‌ నమోదైంది. 
 
ఏపీలో అత్యధికంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో 12.09శాతం, అత్యల్పంగా గుంటూరులో 6.17శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 13.22శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 5.06శాతం పోలింగ్‌ నమోదైంది.
 
తొలి రెండు గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 9.21శాతం ఓటింగ్‌ నమోదైంది. ప్రముఖ శాసనసభ నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఉదయం 9 గంటల వరకు కుప్పంలో 9.72శాతం ఓటింగ్‌ నమోదైంది. మంగళగిరిలో 5.25శాతం, పిఠాపురంలో 10.02శాతం, పులివెందుల 12.44శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.