గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (15:38 IST)

తెలుగుదేశం పరువు నిలిపిన మూడు జిల్లాలు... జైకొట్టిన పట్టణ ఓటర్లు

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాచయం చవిచూసింది. ఈ ఫలితాల్లో 23 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకుంది. 23 అసెంబ్లీ సీట్లలో సగం కంటే ఎక్కువ అంటే 12 స్థానాలు విశాఖ నగరం, తూర్పు, ప్రకాశం జిల్లాల్లోనే రావడం గమనార్హం. విశాఖ నగరంలో నాలుగు స్థానాలు దక్కించుకున్న టీడీపీ మిగిలిన రెండు జిల్లాల్లో చెరో నాలుగు స్థానాలు సొంతం చేసుకుంది. 
 
ఇక విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాల్లోనూ, మూడు పార్లమెంటరీ స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఓటమిపాలై గట్టి దెబ్బతిన్నా నగరం నడిబొడ్డున ఉన్న తూర్పు, పశ్చి, దక్షిణం, ఉత్తరం నియోజకవర్గాల ఓటర్లు మాత్రం పసుపు జెండాకై జై కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.  
 
అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పట్టణ, గ్రామీణ స్థానాలు, పెద్దాపురం, మండపేట స్థానాలను గెల్చుకుంది. ఇక ప్రకాశం జిల్లాలోని చీరాల, పర్చూరు, అద్దంకి, కొండెపి స్థానాల్లో సైకిల్‌ హవా సాగింది.
 
మిగిలిన 11 స్థానాల్లో గుంటూరు పశ్చిమ, రేపల్లె, కృష్ణా జిల్లాలో విజయవాడ తూర్పు, గన్నవరం, పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, ఉండి, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, ఇచ్చాపురం, అనంతపురం జిల్లాలో హిందూపురం, ఉరవకొండ, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని కుప్పం స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి దక్కాయి. గెలిచిన సీట్ల సరళిని బట్టి చూస్తే ఎక్కువ స్థానాలు నగర, పట్టణ ప్రాంతాల్లో ఉండటం గమనార్హం.