శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 2 అక్టోబరు 2020 (21:21 IST)

గాంధీజీ బోధనలు అజరామరం: గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్

గాంధీజీ దేశం కోసం చేసిన అత్యున్నత త్యాగం, స్ఫూర్తిదాయక బోధనలు ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం వహిస్తాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. మహాత్ముని బోధనలు ప్రపంచ నాయకులకు సైతం ప్రేరణగా నిలిచాయన్నారు. రాజ్ భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
 
మహాత్మా గాంధీతో పాటు భారత మాజీ ప్రధాన మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటాలకు పూలమాలలు వేసి వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా అక్టోబర్ 2నే కావటం గమనార్హం. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలకులను భారతదేశం విడిచిపెట్టాలని డిమాండ్ చేశారని, సహాయ నిరాకరణ  ఉద్యమంలో చేరాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారన్నారు.
 
మహాత్ముని పిలుపుకు ప్రతిస్పందనగా, వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారన్నారు. జాతిపిత అడుగుజాడలను అనుసరించే క్రమంలో సత్యం, అహింస సూత్రాలకు తాము అంకితం అవుతామని ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని గవర్నర్ శ్రీ హరిచందన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి శ్రీ ముఖేష్ కుమార్ మీనా, అధికారులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.