శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (19:57 IST)

మిద్దెపై నుంచి దూకి ఐఎఫ్ఎస్ అధికారి బలవన్మరణం...

హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన పేరు డాక్టర్ వి.భాస్కర రమణ మూర్తి, వయసు 59 యేళ్లు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన అధికారి. 1987 బ్యాచ్‌కు చెందిన అధికారి. 
 
ప్రస్తుతం ఈయన ఏపీ అటవీశాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన హైదరాబాదులోని బండ్లగూడలో నివాసం ఉంటున్నారు. భాస్కర రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి చేసుకుని బెంగళూరులో ఉంటోంది. మరో కుమార్తె చదువు పూర్తయింది.
 
ఈ పరిస్థితుల్లో మూర్తి బుధవారం అర్థరాత్రి రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మానసికంగా కుంగుబాటుకు గురైనట్టు భావిస్తున్నారు. గత 3 నెలలుగా భాస్కర్ రమణ సెలవులో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఆయన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. 
 
కాగా, భాస్కర్ రమణ ఆత్మహత్యపై ఈ అధికారి స్నేహితుడు డాక్టర్ రాజా మాట్లాడుతూ, ఆయనకు చెప్పుకోదగ్గ సమస్యలేవీ లేవన్నారు. ఏవైనా ఉంటే ఆఫీసు సమస్యలు ఉండొచ్చని, అది కూడా చిన్నవే అయివుంటాయని, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నారు. ఆరోగ్య సమస్యలు కూడా లేవన్నారు.