శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (12:37 IST)

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన "ఆర్ఎక్స్ 100" మూవీ నిర్మాత

బుల్లితెర సీరియల్ నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసులో ఏ2 నిందితుడుగా తేలి పరారీలో ఉన్న "ఆర్ఎక్స్ 100" నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. శ్రావణిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్‌, సాయికృష్ణారెడ్డిని ఇదివరకే అరెస్టు చేశారు. 
 
అయితే, ఏ2గా ఉన్న అశోక్‌రెడ్డికి పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్సార్‌నగర్‌ ఠాణాకు వస్తానని చెప్పి చివరి నిమిషంలో మస్కా కొట్టాడు. సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. 
 
ఈ క్రమంలో దేవరాజ్ రెడ్డికి శ్రావణి దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన అశోక్ రెడ్డి.. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 7వ తేదీన అమీర్‌పేట హోటల్‌ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. 
 
అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌రెడ్డి అందరూ కలిసి శ్రావణిని శారీరకంగా హింసించారు. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో ఆయన అరెస్టు కోసం పోలీసులు ప్రయత్నించగా, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చివరకు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.