మాస్క్ ఎక్కడ అని ప్రశ్నించినందుకు... మహిళా ఉద్యోగినిపై దాడి...
మాస్క్ ఎక్కడ అని ప్రశ్నించినందుకు దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగినిపై విచక్షణా రహితంగా ఓ ప్రభుత్వ అధికారి దాడికి పాల్పడ్డాడు. ఆయన ఏపీ పర్యాటక శాఖలో డిప్యూటీ మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి, డిప్యూటీ మేనేజరును అరెస్టు చేశారు.
దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ నెల్లూరు పోలీసులను అభినందించారు. ఈ ఘటనపై సత్వరమే స్పందించి, తగిన చర్యలు తీసుకున్నారంటూ నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్‌ను ప్రశంసించారు. అంతేకాదు, ఈ కేసును దిశా పోలీస్ స్టేషన్‌కు అప్పగించాలని, వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని ఎస్పీని ఆదేశించారు.
నెల్లూరు జిల్లా టూరిజం శాఖ కార్యాలయంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగినిని ఓ డిప్యూటీ మేనేజర్ దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో కారణంగానే సదరు అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. "మాస్కు ఎందుకు ధరించలేదు?" అని ఆ మహిళా ఉద్యోగిని ప్రశ్నించడమే డిప్యూటీ మేనేజర్‌ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు, నెల్లూరు జిల్లా టూరిజం కార్యాలయంలో మాస్కు ధరించాలని సూచించిన ఓ కాంట్రాక్టు ఉద్యోగినిపై తీవ్రస్థాయిలో దాడి చేసిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌ను కఠినంగా శిక్షించాలని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ డిమాండ్ చేశారు. దివ్యాంగురాలు అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా హింసించిన డిప్యూటీ మేనేజర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం సరికాదని పేర్కొన్నారు.
మానవ మృగాలు ఈ విధంగా రెచ్చిపోతుంటే, 21 రోజుల్లో న్యాయం చేసేందుకు తెచ్చిన దిశ చట్టం ఎక్కడ? అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. మహిళలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, పాలకులే ప్రతీకారంతో చెలరేగిపోతుంటే కొందరు అధికారులు కూడా అదే పంథాలో అరాచకంగా వ్యవహరిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.