గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (11:33 IST)

ఏపీలో మళ్లీ పెరిగిన మద్యం ధరలు - 24 గంటల్లో రెండోసారి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దఫా ఏకంగా 50 శాతం మేరకు పెంచారు. గత 24 గంటల్లో ధరలు పెంచడం రెండోసారి కావడం గమనార్హం. 
 
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం లాక్‌డౌన్ అమలు చేస్తోంది. దీంతో సర్వం బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలించింది. ఈ సడలింపుల్లో భాగంగా మద్యం షాపులను తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 
 
ఈ సడలింపును అనుకూలంగా మార్చుకున్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాలు సోమవారం నుంచి మద్యం షాపులను తెరిచాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధం పేరుతో ఏకంగా 25 శాతం మేరకు మద్యం ధరలను పెంచిది. 
 
ధరలు పెంచినప్పటికీ, షాపుల ముందు భారీ ఎత్తున క్యూలైన్లు కనిపించడం, భౌతిక దూరం పాటించకుండా, జనాలు తోసుకోవడంపై సమీక్షించిన సీఎం జగన్, మద్యం ధరలను మరింతగా పెంచడం ద్వారా ప్రజలను వైన్ షాపులకు దూరం చేయాలని నిర్ణయించారు. 
 
మరో 50 శాతం మేరకు ధరలను పెంచాలని సీఎం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ధరలను పెంచామని వెల్లడించిన స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్, పెరిగిన కొత్త ధరలతో ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. 
 
దీంతో నిన్న పెరిగిన 25 శాతం కలిపి, మొత్తం 75 శాతం మేరకు ధరలు పెంచినట్లయింది. ఈ నెలాఖరులోగా మరో 15 శాతం మేరకు షాపుల సంఖ్యను తగ్గించాలని కూడా వైఎస్ జగన్ ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామని రజత్ భార్గవ్ వెల్లడించారు.