మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (21:49 IST)

ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు - 7 నుంచి తమిళనాడులో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల తలుపులు సోమవారం నుంచి తెరుచుకున్నాయి. దీంతో మద్యం బాబులు ఉదయం 7 గంటల నుంచి వైన్ షాపుల ఎదుట బారులు తీరారు. ఫలితంగా తొలి రోజున రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు సాగాయి. రాత్రి 7 గంటల తర్వాత మద్యం అమ్మకాలు నిలిపివేశారు. అప్పటివరకు సుమారుగా 40 నుంచి 50 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు ఏపీ అబ్కారీ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. 
 
దేశం వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోవుంది. అయితే, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు షరతులతో కేంద్రం అనుమతి ఇచ్చింది. ఫలితంగా ఏపీలో మద్యం దుకాణాలను తెరుచుకున్నాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుల్లో మాత్రం ఈ దుకాణాలు తెరుచుకోలేదు. కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం కరోనా భయాన్ని పక్కనబెట్టి.. రాష్ట్రంలో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చారు. 
 
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3468 వైన్ షాపులు ఉండగా, వీటిలో 2345 దుకాణాల్లో మద్యం విక్రయాలున నిర్వహించారు. ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రం ఈ దుకాణాలు తెరుచుకోలేదు. ఈ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైన్ షాపులు మూసివేశారు. 
 
మరోవైపు, రాత్రి 7 గంటల వరకు సాగిన మద్యం విక్రయాల కోసం మందుబాబులు బారులు తీరారు. ఏపీ, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లోని మద్యం దుకాణాల వద్దకు తమిళనాడు వాసులు రావడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొనడంతో ఆయా దుకాణాల్లో మద్యం విక్రయాలను అధికారులు నిలిపివేశారు.
 
మరోవైపు, తమిళనాడు ప్రభుత్వం కూడా మద్యం విక్రయాలకు పచ్చజెండా ఊపింది. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రభుత్వ టాస్మాక్ దుకాణాల్లో మద్యం విక్రయాలు జరపాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. 
 
నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సోమవారం కూడా ఏకంగా 526 కేసులు నమోదయ్యాయి. కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం ఆలోచన చేయకుండా మద్యం విక్రయాలకు పచ్చజెండా ఊపింది. 
 
ఈ నెల 7 నుంచి మద్యం అమ్మకాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతాయని చెప్పింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని పేర్కొంది.