గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (17:52 IST)

తిరుపతిలో మద్యం కోసం అమ్మాయిల క్యూ.. సరిహద్దుల్లో ఉద్రిక్తత

కేంద్రం ప్రభుత్వం సడలించిన ఆంక్షల నేపథ్యంలో దేశంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మద్యం కొనుగోలు చేసేందుకు తాగుబోతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. సామాజిక భౌతిక దూరాన్ని ఏమాత్రం పాటించకుండా, ముఖానికి మాస్కులు లేకుండా బారులు తీరారు. ఈ తాగుబోతులతో కలిసి అమ్మాయిలు కూడా వరుస లైన్లలో నిలబడ్డారు. తిరుపతిలో ఈ దృశ్యం కనిపించింది. అయితే, ఈ అమ్మాయిలు మద్యాన్ని తమకోసం కొనుగోలుచేశారా లేదా తమ ఇంట్లోని వారికి కొనుగోలు చేశారన్నది తెలియలేదు. కానీ, తాగుబోతులతో కలిసి వైన్ షాపుల ముందు వరుసలో నిలపడం మీడియా కంటికి కనిపించింది. 
 
ఇకపోతే, ఈ మద్యం అమ్మకాలు తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సృష్టించింది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ప్రస్తుతం మద్యం అమ్మకాలపై నిషేధం ఉండటంతో అక్కడి మందుబాబులు సరిహద్దు ప్రాంతమైన నగరికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ క్రమంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
జీవీపాలెం, రామాపురంలోని మద్యం దుకాణాల వద్దకు తమిళనాడు వాసులు వస్తుండటంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జీవీపాలెం, రామాపురంలోని 7 మద్యం దుకాణాల వద్దకు పోలీసులు చేరుకుని, షాపులను మూసివేసి, తమిళనాడు వాసులను వెనక్కి పంపించేశారు. 
 
అలాగే, చిత్తూరు జిల్లాలోని పాలసముద్రంలోనూ మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు నుంచి మందుబాబులు పాలసముద్రంలోని మద్యం దుకాణాల వద్దకు రావడంతో అమ్మకాలు నిలిచిపోయినట్టు సమాచారం.