కరోనా నిర్మూలనకు జగన్ సర్కారు కట్టుబడిలేదు : పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కారు చిత్తశుద్ధితో పని చేయడం లేదని ఆయన ఆరోపించారు.
ఆయన సోమవారం అనంతపురం జిల్లాలోని జనసేన పార్టీ నేతలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రైతులు, ఆ జిల్లాలోని చిక్కుకునిపోయిన వలస కూలీలు, కార్మికుల బాగోగులపై పవన్ ఆరా తీశారు.
ఆ తర్వాత ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ, కరోనా వైరస్ నిర్మూలన కోసం జగన్ సర్కారు ఏమాత్రం చిత్తశుద్ధితో పని చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఇతర అంశాలపై ఉన్న శ్రద్ధ కరోనా వైరస్ నిర్మూలనపై జగన్ సర్కారు చూపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను నిలదీయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే, ఈ వైరస్‌ను నిర్మూలించడం అంత సాధ్యంకాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, గ్రీన్, ఆరెంజ్ జోన్లకు చెందిన వారిని రెడ్ జోన్లలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.