1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (12:15 IST)

ఏపీ సర్కారు సరికొత్త నిర్ణయం-ఊరికో మహిళా పోలీస్!

ఏపీ సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శుల హోదాను ‘మహిళా పోలీసు’గా మారుస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ఇకపై వీరంతా గ్రామ సచివాలయాల్లో పోలీసు యూనిఫామ్‌లోనే విధులు నిర్వర్తిస్తారు.
 
పోలీసు కానిస్టేబుళ్లకు ఉండే అధికారాలన్నీ  వీరికీ కల్పిస్తారు. వీరంతా తమ పరిధిలో సంబంధిత పోలీసు స్టేషన్‌ ప్రతినిధులుగా వ్యవహరిస్తారని జీవోలో తెలిపారు. వీరికి పోలీసు శిక్షణ కూడా ఇస్తామన్నారు. మరోవైపు... ఈ ‘మహిళా పోలీసు’లకు పదోన్నతులు కూడా కల్పిస్తామని, దీనికోసం అదనంగా హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు సృష్టిస్తామని హోంశాఖ తెలిపింది. ఈ మేరకు అవసరమైన చట్ట సవరణలను చేస్తామని చెప్పింది. 
 
తాడేపల్లి ప్రాంతంలో సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై  బుధవారం సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. "రాష్ట్రంలోని ప్రతి మహిళ మొబైల్‌ ఫోన్‌లో ‘దిశ’ యాప్‌ తప్పనిసరిగా ఉండేలా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలి. స్థానిక పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్లి మహిళల ఫోన్‌లలో దిశ యాప్‌ను డౌన్లోడ్‌ చేయించాలి" అని ఆదేశించారు.