శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (10:46 IST)

భర్తతో సన్నిహితంగా ఉంటే విచారిస్తారా.. ఇకపై అలా కుదరదు : హైకోర్టు

కట్టుకున్న భర్తతో పరాయి మహిళ సన్నిహితంగా ఉన్నంత మాత్రమానా అతని భార్య ఫిర్యాదు మేరకు సన్నిహితంగా ఉన్న మహిళ వద్ద విచారించడాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. ఐపీసీ సెక్షన్ 498ఏ కింద నమోదు చేసిన కేసులో భర్తతో సన్నిహితంగా ఉంటున్న వేరే మహిళను విచారించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 
 
తన భర్తతో అక్రమ సాన్నిహితం కలిగి ఉన్నారని ఒక మహిళ ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా దిశ మహిళ ఠాణా పోలీసులు 498ఏ, మరో సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ హైకోర్టులో పిటిషన్ వేశారు. 
 
భారత శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్ 498ఏ కింద నమోదు చేసిన కేసులో భర్తతో సన్నిహితంగా ఉంటున్న వేరే మహిళను విచారించడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది. సెక్షన్ 498ఏ(మహిళల పట్ల క్రూరంగా వ్యవహరించటం)ప్రకారం.. భర్త రక్తసంబంధీకులు, అతని బంధువులను మాత్రమే విచారించడానికి వీలుందని స్పష్టం చేసింది. 
 
ఓ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ 'వేరే మహిళ'పై పోలీసులు 498ఏ కింద నమోదు చేసిన కేసులో ఆమె అరెస్టుతో పాటు తదుపరి చర్యలను నిలువరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.