గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (09:14 IST)

మీ యిష్టానికి ఇస్తానంటే కుదరదు.. వడ్డీతో సహా చెల్లించాల్సిందే

కరోనా వైరస్ మహమ్మారితో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయని, అందువల్ల ఉద్యోగులకు వేతనాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోత విధించింది. ముఖ్యంగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ కోత విధించింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలుకాగా, విచారణకు స్వీకరించిన కోర్టు... వేతన కోతపై ప్రభుత్వం జారీచేసిన జీవోలను కొట్టివేసింది. పైగా, ఆ రెండు నెలల్లో ఉద్యోగులకు కోత విధించిన జీతాలను, అదేవిధంగా మార్చి నెలకు సంబంధించి రిటైర్డ్‌ ఉద్యోగుల పూర్తి పెన్షన్‌ను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మొత్తానికి 12 శాతం వడ్డీ కలిపి రెండు నెలల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ గత మార్చి 31న జీవో నంబరు 26, ఏప్రిల్‌ 26న జీవో నం.37లను జారీ చేసింది. మార్చి నెలకుగాను ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌లో 50 శాతం కోత విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ రిటైర్డ్‌ జిల్లా న్యాయాధికారి డీ లక్ష్మీ కామేశ్వరి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించనప్పుడు ఉద్యోగులకు పూర్తి జీతభత్యాలు చెల్లించకపోవడం చట్టవిరుద్ధమని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఈ పిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. పిటిషనర్‌ వాదనలతో పూర్తిగా ఏకీభవించింది. ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరికాదని పేర్కొంది. రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌లోనూ కొంతభాగాన్ని వాయిదా వేయడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వపరిధిలోని అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు కోత విధించిన జీతం మొత్తాన్ని చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.